Pawan Kalyan: మాకు సంబంధంలేదని ఆ చానెల్ తప్పించుకోలేదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Condemns Remarks Against Amaravati Women
  • సాక్షి టీవీ చానల్లో అమరావతి మహిళలపై వ్యాఖ్యలు
  • ఖండించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • జర్నలిస్టు ముసుగులో వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం
  • ఆ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర దాగి ఉందని ఆరోపణ
  • మహిళలను, బౌద్ధ వారసత్వాన్ని అవమానించడం దారుణమన్న జనసేనాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానెల్‌లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను, ఈ నేల చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

"ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానెల్ కూడా... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు... చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక... నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్నీ అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి" అని స్పష్టం చేశారు.

•ఆచార్య నాగార్జునుడు కాలంలో విలసిల్లిన బౌద్ధం

అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలియవు అనిపిస్తోంది. మౌర్యులు, ఇక్ష్వాక రాజుల శాసనాలు లభ్యమయ్యాయి. కాకతీయులు ఈ ప్రాంతంలో శాసనాలు వేయించారు. బౌద్ధం విలసిల్లిన నేల అని చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ రచనలు చెబుతున్నాయి. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతమిది. మహాయాన బౌద్ధం ముఖ్య సంప్రదాయంగా ఆ ధర్మం విస్తరించింది. ఆ సంప్రదాయంతోపాటు ఇతర సంప్రదాయాలూ ఇక్కడ ఆదరణ పొందాయి. కాబట్టే ఈ ప్రాంతాన్ని బౌద్దులు పవిత్రంగా భావిస్తారు. నాటి అమరావతి శిల్పకళారీతి.. బౌద్ధం విస్తరించిన శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాల్లో అదరణ పొందింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు- ఆ ధర్మాలను విశ్వసించేవారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

కుల ముద్రలు వేశారు... మహిళలను అవమానిస్తున్నారు

రాజధానిపై గత పాలకుడు, ఆయన సహచరులు కుత్సితమైన వ్యాఖ్యలు చేస్తూ అమరావతి ప్రతిష్ఠను దిగజార్చాలని చూశారు. రాజధానిని శ్మశానంతో పోల్చారు. కుల ముద్ర వేశారు. భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తే తమ రాజకీయ బలంతో అణచివేసే ప్రయత్నం చేసి కేసులుపెట్టి వేధించారు. రాజధాని కోసం భూములు ఇచ్చినవారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల రైతులు ఉన్నారు. తాము భూములు ఇచ్చాము, రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేసిన సదరు సామాజిక వర్గంవారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి ఇక్కట్ల పాల్జేసింది గత ప్రభుత్వం. 14 శాతం బీసీ రైతులు, 20 శాతం రెడ్డి సామాజిక వర్గం, 18 శాతం కమ్మ, 9 శాతం కాపు, 3 శాతం ముస్లిం రైతులు భూములు ఇచ్చారు.

టీవీ ఛానెల్ ద్వారా రాజధాని ప్రాంత మహిళలపై నీచ వ్యాఖ్యలు చేయించారు. అంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా? అమరావతి ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను అవహేళన చేయడమే కదా?

ఈ ప్రాంతంపై కక్షపూరితంగా, ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడు ముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోంది. ఈ విధంగా కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా, వారి వెనుక ఉన్నవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. నీచ వ్యాఖ్యలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళతారు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan
Amaravati
Andhra Pradesh
Capital City
Controversy
TV Channel
Women
Buddhism
Historical Significance
Political Conspiracy

More Telugu News