MSK Prasad: అమరావతి మహిళలను దూషించడంపై ఎంఎస్‌కే ప్రసాద్ స్పందన

MSK Prasad Condemns Insulting Comments on Amaravati Women
  • అమరావతి మహిళలపై సాక్షి జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యల దుమారం
  • మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ తీవ్ర ఖండన
  • టీవీ చర్చల్లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికాదని హితవు
  • అమరావతి ఎంతో పవిత్రమైన ప్రాంతమని వెల్లడి
  • బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
అమరావతి ప్రాంత మహిళల గురించి, అమరావతి రాజధాని గురించి సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో ఓ పాత్రికేయుడు చేసిన అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలపై భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్, మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ (మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఒక టీవీ చర్చా కార్యక్రమంలో అమరావతిపైనా, అక్కడి మహిళలపైనా కొందరు అనుచితంగా మాట్లాడటం తనను తీవ్రంగా బాధించిందని ఎంఎస్‌కే ప్రసాద్ తెలిపారు. తాను కూడా అమరావతి గడ్డపైనే పుట్టి పెరిగానని, తన జీవితమంతా ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందని గుర్తుచేశారు. "మా తల్లి, చెల్లెళ్లు, అక్కలు, పిన్నమ్మలు, అత్తయ్యలు అందరూ ఇక్కడే, అమరావతి ప్రాంతంలోనే ఉన్నారు. ప్రతి పండగకూ అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మాకు ఆనవాయతీ" అని ఈ ప్రాంతంతో తన అనుబంధాన్ని వివరించారు.

ఇంతటి పవిత్రమైన అమరావతిని ఎంతో ముందుచూపుతో, మేధావులతో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిగా నిర్ణయించారని ప్రసాద్ అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మధ్యలో ఉండటం, నిపుణుల సలహాలు తీసుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయని, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి మళ్ళీ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఈ రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.

"ఇంత గొప్ప, పవిత్రమైన స్థానం గురించి, అక్కడి మహిళల గురించి అశ్లీలంగా మాట్లాడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటివి మళ్ళీ జరగకూడదు" అని ఎంఎస్‌కే స్పష్టం చేశారు. ఇలాంటి చర్చల్లో పాల్గొన్న వారిపైనా, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆడవాళ్లు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతానికి చెందినవారైనా వారిని గౌరవించడం మన సంస్కృతి అని, ఆంధ్రప్రదేశ్ అంటేనే మహిళలకు గౌరవం ఇచ్చే ప్రదేశమనే పేరుందని ప్రసాద్ అన్నారు. "మన సొంత రాజధాని గురించి, మన ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడటం చాలా తప్పు. భవిష్యత్తులో మరెవరూ మన రాజధాని గురించి గానీ, మహిళల గురించి గానీ చెడుగా మాట్లాడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి" అని కోరారు.

ఇది ఛానల్ సమస్య కాదని, వ్యక్తుల సమస్య అని, ఇలాంటి విషయాలపై తెలివైన వారు కూర్చుని చర్చలు చేయడం బాధాకరమని అన్నారు. మీడియా ప్రజల గొంతుక అని, అలాంటి మీడియానే తప్పుడు ప్రచారాలు, తప్పుడు చర్చలు ప్రజల్లోకి తీసుకెళితే ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ప్రశ్నించారు. ప్రాంతాలకు అతీతంగా మనందరం మహిళలను గౌరవించాలని, మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఎంఎస్‌కే డిమాండ్ చేశారు.

"ఆడవాళ్లు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్లు లేకుండా ఈ మగ ప్రపంచం లేదు. అలాంటిది ఇంత పవిత్రమైన ప్రదేశంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు తప్పుడు చర్చలు చేయాల్సిన అవసరం ఏముంది?" అని ఎంఎస్‌కే ప్రశ్నించారు. రాజధాని సౌకర్యాలు, సచివాలయాలు, ప్రజలకు ఉపాధి వంటి నిర్మాణాత్మక విషయాలపై చర్చలు జరగాలని, అంతేగానీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తలపెట్టిన మంచి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకుండా అశ్లీల చర్చలు పెట్టకూడదని హితవు పలికారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
MSK Prasad
Amaravati
Andhra Pradesh
Sakshi TV
Chandrababu Naidu
Narendra Modi
Women Respect
Capital City
Telugu News
AP Politics

More Telugu News