Liver Diseases: ఇవి నిశ్శబ్ద వ్యాధులు... లక్షలాది మందిని కబళిస్తున్నాయి!

Liver Diseases Silent Killers Affecting Millions
  • ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు
  • చాపకింద నీరులా విస్తరిస్తున్న ఎంఏఎస్‌ఎల్‌డి, ఎంఏఎస్‌హెచ్
  • బయటకు లక్షణాలు కనిపించకపోవడమే పెను ప్రమాదం
  • ముందస్తు గుర్తింపు, రోగి కేంద్రిత సంరక్షణే మార్గమన్న నిపుణులు
  • 2027 నాటికి ఎంఏఎస్‌హెచ్ నిర్ధారణ రేటు రెట్టింపు చేయాలని లక్ష్యం
  • వ్యాధిగ్రస్థుల పట్ల వివక్ష చూపొద్దని, గౌరవంగా చూడాలని పిలుపు

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమకు తెలియకుండానే దీర్ఘకాలిక కాలేయ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ 'సైలెంట్ కిల్లర్' వ్యాధులపై తక్షణమే దృష్టి సారించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఈ వారం ప్రారంభంలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో, కాలేయ వ్యాధుల ముందస్తు గుర్తింపు, మెరుగైన చికిత్స, రోగి-కేంద్రిత సంరక్షణ వంటి అంశాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 శాతం మందిలో కనిపిస్తున్న ఒక సాధారణ కాలేయ సమస్య. దీని తీవ్రమైన రూపమైన మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASH) జనాభాలో దాదాపు 5 శాతం మందిని ప్రభావితం చేస్తోంది. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, లేదా ఇతర కార్డియోమెటబాలిక్ సమస్యలు ఉన్నవారిలో ఈ వ్యాధుల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ వ్యాధులు ముదిరి సిర్రోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ దశకు చేరుకునే వరకు తరచుగా ఎలాంటి లక్షణాలూ చూపించవు. దాంతో వీటిని గుర్తించడం కష్టమవుతోంది. దీనిపై 'ది లాన్సెట్ రీజినల్ హెల్త్ యూరప్' పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది.

బార్సిలోనా సమావేశంలో పాల్గొన్న వందలాది మంది అంతర్జాతీయ హెపటాలజీ మరియు జీవక్రియ ఆరోగ్య నిపుణులు, ఎంఏఎస్‌హెచ్ నిర్ధారణ రేటును 2027 నాటికి రెట్టింపు చేయాలని గట్టిగా కోరారు. లక్షలాది మందిని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తున్న ఈ వ్యాధిని ముందుగా గుర్తించకపోవడం వల్ల రోగుల పరిస్థితి విషమించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం కూడా పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రమాదంలో ఉన్న రోగులను గుర్తించడానికి నాన్-ఇన్వాసివ్ పరికరాలు, కృత్రిమ మేధ (AI) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వారు నొక్కి చెప్పారు. మెరుగైన నిర్ధారణతో పాటు సమర్థవంతమైన చికిత్సలు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ వ్యాధి ముప్పును 2030 నాటికి నిర్మూలించడానికి కొన్ని నిర్దిష్ట చర్యలను నిపుణులు ప్రతిపాదించారు. ప్రమాదంలో ఉన్న సమూహాలకు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ నిర్వహించడం, సాధారణ ఆరోగ్య పరీక్షలలో కాలేయ పరీక్షలను చేర్చడం, రీయింబర్స్‌మెంట్ విధానాలను నవీకరించడం, ప్రాథమిక సంరక్షణ, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ విభాగాలతో పాటు రోగుల సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి.
Liver Diseases
MASLD
MASH
Metabolic Dysfunction
Fatty Liver
Cirrhosis
Liver Cancer
Barcelona
The Lancet Regional Health Europe
AI

More Telugu News