Raja Singh: సొంత పార్టీ నేతలే టార్గెట్... మరోసారి విమర్శలు గుప్పించిన రాజాసింగ్!

Raja Singh Criticizes Own Party Leaders Again
  • కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
  • చెవులు ఉన్నా ఆయనకు వినపడవంటూ వ్యాఖ్యలు
  • బండారు దత్తాత్రేయ అత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చోటుచేసుకున్న వైనం
సొంత పార్టీ నాయకుడినే లక్ష్యంగా చేసుకుని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో మరోసారి పరోక్షంగా కిషన్ రెడ్డిపై ఆయన విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందిస్తూ కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవని వ్యాఖ్యానించారు. నోరు ఉండి కూడా చెప్పరంటూ రాజాసింగ్ అన్నారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని రాజాసింగ్ ప్రశ్నించారు.

రాజాసింగ్ వేదికపై నుంచే కిషన్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వారిద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వీరి మధ్య విభేదాలకు సంబంధించి పలు సందర్భాల్లో కిషన్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వాటిని తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదే రకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. ఆ నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మాట్లాడి సముదాయించిన విషయం తెలిసిందే. 
Raja Singh
Kishan Reddy
Telangana BJP
BJP Telangana
Revanth Reddy
Bandi Sanjay
Telangana Politics
Goshahal MLA
Haryana Governor
Political Criticism

More Telugu News