Malreddy Rangareddy: మంత్రి పదవి దక్కకపోవడంపై... మల్ రెడ్డి ఏమంటున్నారంటే...!

Malreddy Rangareddy Disappointed After Not Getting Minister Post
  • పదేళ్లుగా బీఆర్ఎస్‌తో కొట్లాడి కాంగ్రెస్‌ను కాపాడింది తామేనన్న మల్‌రెడ్డి రంగారెడ్డి
  • పార్టీలో కొత్తవారికి పదవులు ఇస్తే కార్యకర్తలు బాధపడతారన్న రంగారెడ్డి
  • తన సామాజికవర్గమే అడ్డొస్తే పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తానని వెల్లడి
  • ఉమ్మడి పది జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్
తెలంగాణలో నిన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది. అనేక మంది మంత్రి పదవుల కోసం ప్రయత్నించినప్పటికీ, ముగ్గురికే అవకాశం లభించింది. సీనియర్లను కాదని తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అడ్డూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరికి, గతంలో ఎంపీగా పనిచేసిన వివేక్ వెంకటస్వామికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడిన నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని పార్టీ పెద్దలు బుజ్జగించారు. అనంతరం ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పదేళ్లు బీఆర్ఎస్‌తో పోరాడామని, కాంగ్రెస్‌ను కాపాడింది తామేనని చెప్పుకొచ్చారు. పార్టీ లైన్‌లోనే ఉంటానని పేర్కొన్నారు. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ మొరను అధిష్ఠానం వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తవారికి పదవులు ఇస్తే కార్యకర్తలు బాధపడతారని, పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని అన్నారు. కొన్ని జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు గతంలో ఆరుగురు మంత్రులు ఉండేవారని గుర్తు చేశారు. తమ బాధను అధిష్ఠానానికి చెప్పే అవకాశం పీసీసీ చీఫ్ ఇవ్వాలని కోరారు. తనకు సామాజికవర్గమే అడ్డు వస్తే పార్టీ కోసం పదవిని త్యాగం చేస్తానని పేర్కొన్నారు.

మల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే 1981లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో తోరూర్ సర్పంచ్‌గా గెలిచిన ఆయన 1986లో హైదరాబాద్ డీసీసీబీ డైరెక్టర్‌గా పని చేశారు. 1994లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1999 ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా తన సిట్టింగ్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2009 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి, 2014 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి చెందారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరగా, 2023 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 
Malreddy Rangareddy
Telangana cabinet expansion
Ibrahimpatnam MLA
Congress party
BRS party
Telangana politics
Minister post
Party leadership
Social justice
New ministers

More Telugu News