Greta Thunberg: గాజాకు సాయం.. గ్రెటా థన్‌బర్గ్ నౌకను అడ్డగించిన ఇజ్రాయెల్ దళాలు

Greta Thunbergs Gaza Aid Ship Intercepted by Israeli Forces
  • బ్రిటిష్ జెండాతో వెళ్లిన ‘మాడ్లీన్’ నౌకను అడ్డుకున్న ఇజ్రాయెల్ దళాలు
  • కిడ్నాప్ అంటున్న ఫ్రీడమ్ ఫ్లోటిల్లా నిర్వాహకులు
  • అంతర్జాతీయ మద్దతుకు గ్రెటా పిలుపు
  • హమాస్‌కు ఆయుధాలు చేరకుండా అడ్డుకోవడానికేనన్న ఇజ్రాయెల్ 
  • గాజాలో తీవ్ర ఆహార, నీటి కొరతపై ఐరాస హెచ్చరికల నడుమ ఘటన
గాజాకు మానవతా సాయం అందించేందుకు బయలుదేరిన ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ప్రయాణిస్తున్న నౌకను ఇజ్రాయెల్ సైనిక దళాలు అడ్డగించాయి. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చర్యను నౌకాయాన నిర్వాహకులు ‘కిడ్నాప్’గా అభివర్ణించగా, ఇజ్రాయెల్ మాత్రం తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని పేర్కొంది.

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్, మరో 11 మంది అంతర్జాతీయ వలంటీర్లతో కూడిన బృందం ‘మాడ్లీన్’ అనే నౌకలో గాజాకు మానవతా సాయం తీసుకెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు వారిని అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు, యాత్రను నిర్వహిస్తున్న ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కోయిలేషన్ సంస్థ ధ్రువీకరించాయి. బ్రిటిష్ జెండాతో ప్రయాణిస్తున్న మాడ్లీన్ నౌక, సుమారు వారం రోజుల క్రితం సిసిలీ నుంచి బయలుదేరింది. ఇందులో పసిపిల్లల కోసం పాలపొడి, ఆహార పదార్థాలు, వైద్య సామగ్రి వంటివి ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, దిగ్బంధనం కారణంగా గాజాలో నెలకొన్న తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడం, అక్కడి ప్రజలకు సాయమందించడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ బృందంలో థన్‌బర్గ్‌తో పాటు ఫ్రాన్స్‌కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రీమా హసన్ కూడా ఉన్నారు. మార్గమధ్యంలో లిబియా తీర రక్షక దళాల నుంచి తప్పించుకు పారిపోతున్న నలుగురు వలసదారులను కూడా ఈ నౌక రక్షించినట్టు సమాచారం.

నౌక గాజా సమీపానికి చేరుకోగానే అంతర్జాతీయ జలాల్లో పలు ఇజ్రాయెల్ నావికా దళ నౌకలు దీనిని చుట్టుముట్టి అడ్డగించాయని నిర్వాహకులు, సోషల్ మీడియా కథనాలు వెల్లడించాయి. కార్యకర్తలు క్షేమంగా ఉన్నారని, వారికి నీరు, శాండ్‌విచ్‌లు అందించామని, వారిని తమ స్వదేశాలకు పంపిస్తామని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. మానవతా సాయాన్ని మాత్రం నిర్దేశిత మార్గాల ద్వారా గాజాకు చేరవేస్తామని వారు పేర్కొన్నారు.

అయితే, ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కోయిలేషన్ నిర్వాహకులు ఇజ్రాయెల్ చర్యను ‘కిడ్నాప్’ అంటూ తీవ్రంగా ఖండించారు. గ్రెటా థన్‌బర్గ్ తదితరులు ముందుగానే రికార్డు చేసిన సందేశాలను విడుదల చేస్తూ, అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. "మాడ్లీన్ నౌకలోని అంతర్జాతీయ వలంటీర్లను నిర్బంధించే చట్టపరమైన అధికారం ఇజ్రాయెల్‌కు లేదు" అని మానవ హక్కుల న్యాయవాది, ఫ్లోటిల్లా నిర్వాహకురాలు హువైదా అరాఫ్ అన్నారు. ఈ నిర్బంధం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ యాత్రను ఒక ‘ప్రచార స్టంట్’గా కొట్టిపారేసింది. హమాస్‌కు ఆయుధాలు చేరకుండా నిరోధించేందుకే తమ నావికాదళ దిగ్బంధనం అమలులో ఉందని పునరుద్ఘాటించింది. ఆ నౌకను గాజాకు చేరుకోనివ్వబోమని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ముందే హెచ్చరించారు. కార్యకర్తలను ‘హమాస్ ప్రచారకర్తలు‘గా ఆయన అభివర్ణించారు. దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

రెండు నెలలుగా సహాయ పంపిణీ నిలిచిపోవడంతో గాజాలో ఆహారం, నీరు, వైద్య సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడిందని, మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
Greta Thunberg
Gaza aid
Israel
Freedom Flotilla Coalition
Madeline ship
Humanitarian aid
Israel Katz
Reem Hassan
Gaza crisis
Human rights

More Telugu News