VVR Krishnam Raju: అమరావతిని వేశ్యల రాజధాని అన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు... రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు

Journalist VVR Krishnam Rajus Amaravati Remarks Spark Protests
  • జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం
  • ‘సాక్షి’ టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపైనా వెల్లువెత్తిన నిరసనలు
  • బాధ్యులపై చర్యలు కోరుతూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
  • సాక్షి కార్యాలయాల వద్ద ధర్నాలు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత తీవ్రంగా ఖండన
  • ఎన్‌హెచ్‌ఆర్సీ, ప్రెస్ కౌన్సిల్‌కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు
  • తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు
అమరావతి మహిళలను కించపరిచేలా ‘సాక్షి’ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు వీవీఆర్ కృష్ణంరాజు చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు, వాటిని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సాక్షి’ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుపై నిన్న అన్ని జిల్లాల్లోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రైతులు, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఫిర్యాదులు
నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అనేక పోలీస్ స్టేషన్లలో వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు ‘సాక్షి’ యాజమాన్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు, పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక గత పాలకుల కుట్ర ఉందని, అమరావతి ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి లక్ష్యమని కూటమి నేతలు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నాయకులు హెచ్చరించారు. తుళ్లూరులో జేఏసీ నాయకులు మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైన తరుణంలో వైసీపీ నాయకులు విషం చిమ్ముతున్నారని, రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రముఖుల తీవ్ర స్పందన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తన సొంత టీవీ ఛానెల్‌లో అమరావతి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా మాజీ సీఎంగా జగన్ ఖండించకపోవడం, క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. రాజకీయ కక్షతో మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతాన్ని, మహిళలను, బౌద్ధాన్ని అవమానించే కుటిల యత్నమిదని ఆరోపించారు. ఇవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించలేమని, ‘సాక్షి’ చానెల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి కుట్రలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ కుట్ర వెనుక ఉన్నవారి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. అమరావతి అంటే మాజీ సీఎం జగన్‌కు అక్కసని, చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు వస్తుంటే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి కూడా అమరావతిపై అక్కసుతోనే వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.

జాతీయ కమిషన్లకు ఫిర్యాదులు, చట్టపరమైన చర్యలు
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ కిశోర్‌ రహాట్కర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. మీడియా బాధ్యతలను ఉల్లంఘించి, మహిళల గౌరవానికి భంగం కలిగించారని, వారి వివరణ కోరడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కోరారు.

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సాక్షి ఛానెల్‌కు సమన్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రాంతం దళిత నియోజకవర్గంలో ఉందని, దళిత మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను కలిసిన రాజధాని మహిళలు, తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు. బాధ్యులపై చర్యలకు ముసాయిదా లేఖలు సిద్ధం చేశామని, సమన్లు జారీ చేస్తామని శైలజ హామీ ఇచ్చారు.

తొలి కేసు నమోదు.. ఇతర ఆరోపణలు
ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి ఛానెల్ యాజమాన్యంపై తొలి కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

గుంటూరులో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి పేరోల్ జర్నలిస్టుల్లో కృష్ణంరాజు ఒకరని, గతంలో అంబేద్కర్ పైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కడపలో అమరావతి మహిళా జేఏసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ జగన్, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేనిలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ విషయంపై మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ జగన్‌కు మతిభ్రమించి మహిళలను కించపరిచేలా మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
VVR Krishnam Raju
Amaravati
Sakshi TV
Kommineni Srinivasa Rao
Andhra Pradesh
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Amaravati protests
Women's rights
Defamation

More Telugu News