AB Venkateswara Rao: జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారు: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ

AB Venkateswara Rao Slams Jagan for Misusing Police Power
  • వైసీపీ హయాంలో జరిగిన దుర్మార్ఘాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ఏబీ వెంకటేశ్వరరావు
  • అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని జగన్ ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్న ఏబీవీ
  • తెనాలి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని వెల్లడి
జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో చేయకూడని పనులన్నీ చేయించారని, తప్పుడు కేసులు పెట్టించారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుంటూరు జనచైతన్య వేదిక హాలులో 'పోలీసు వ్యవస్థలో సంస్కరణలు' అనే అంశంపై నిన్న జరిగిన చర్చా గోష్ఠిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

జగన్‌పై అనేక కేసులు ఉన్నా చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకుని ఏడేళ్లుగా న్యాయస్థానానికి వెళ్లడం లేదన్నారు. పోలీసు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు చైతన్యంతో ఉద్యమించి పార్టీలు తమ మేనిఫెస్టోలో పోలీసు సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్మార్గాలన్నింటిపైనా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి చర్యలను అందరూ ఖండించాల్సిందేనన్నారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. 
AB Venkateswara Rao
Jagan Mohan Reddy
Andhra Pradesh Police
Police Reforms
Guntur
Janachaitanya Vedika
Fake Cases
Retired IPS Officer

More Telugu News