Maoists IED Blast: ఛత్తీస్ గఢ్ లో పోలీసుల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

ASP Akash Rao Killed in Chhattisgarh Maoist IED Blast
  • ఏఎస్పీ ఆకాశ్ రావు దుర్మరణం
  • పలువురు పోలీసులకు తీవ్ర గాయాలు
  • సుక్మా జిల్లా కొంటాలో ఐఈడీ అమర్చి దాడి చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మరోసారి నక్సలైట్లు పంజా విసిరారు. కొంటా-ఎరబోర్ రహదారిపై దొండ్రా సమీపంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలిన ఘటనలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) ఆకాశ్ రావు తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు.

జూన్ 10న మావోయిస్టు సంస్థలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఎస్పీ ఆకాశ్ రావు తన బృందంతో కలిసి కొంటాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. కొంటా ఎస్డీఓపీ, కొంటా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తోపాటు మరో ఇద్దరు సిబ్బందితో నిఘా విధులు నిర్వర్తిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నక్సలైట్లు వ్యూహాత్మకంగా అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలడంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు.

వెంటనే క్షతగాత్రులందరినీ కొంటా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏఎస్పీ ఆకాశ్ రావు మరణించారు. గాయాలపాలైన కొంటా ఎస్డీఓపీ, ఎస్హెచ్ఓ, మరో జవాన్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. సుక్మా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ ఈ దుర్ఘటనను, ఏఎస్పీ ఆకాశ్ రావు మరణాన్ని ధ్రువీకరించారు.
Maoists IED Blast
Akash Rao
Chhattisgarh
Naxalites
Sukma
Police
Konta
Kirana Chavan

More Telugu News