Kommineni Srinivasa Rao: దొంగ కేసు పెట్టారు: కొమ్మినేని శ్రీనివాసరావు

Kommineni Srinivasa Rao Claims Political Conspiracy Behind Police Action
  • సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన పోలీసులు
  • తుళ్లూరు రావాలని కోరిన వైనం, ఐడీ కార్డులు మాత్రమే చూపించారని వెల్లడి
  • పోలీసులు స్నేహపూర్వకంగానే ప్రవర్తించారు, మర్యాదగానే ఉన్నారని చెప్పిన కొమ్మినేని
  • ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కొమ్మినేని ఆరోపణ
  • తాను "అమరావతి మహిళలు" అనే పదాన్ని ఎక్కడా వాడలేదని స్పష్టీకరణ
  • ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తే ఎవరినైనా జైలుకు పంపే పరిస్థితి ఉందని ఆవేదన
సీనియర్ జర్నలిస్ట్, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు తన ఇంటికి పోలీసులు వచ్చారని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. తుళ్లూరు ప్రజలు ఫిర్యాదు చేశారని చెబుతూ, అక్కడికి రావాల్సిందిగా పోలీసులు తనను కోరినట్లు ఆయన తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో ఎలాంటి అధికారిక పత్రాలు, సెర్చ్ వారెంట్ వంటివి చూపించలేదని, కేవలం ఐడీ కార్డులు మాత్రమే చూపించి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని కొమ్మినేని వివరించారు.

కొమ్మినేని శ్రీనివాసరావు వెల్లడించిన ప్రకారం, పోలీసులు ఆయన నివాసానికి వచ్చి తుళ్లూరు రావాలని కోరారు. "పోలీసులు స్నేహపూర్వకంగానే ప్రవర్తించారు, మర్యాదగానే ఉన్నారు. కానీ, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పలేదు. సరైన పత్రాలు ఉన్నాయా అని అడిగినప్పుడు  వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మొదట నేను రావడానికి సిద్ధమేనని చెప్పాను. కానీ, మీరు వచ్చిన తర్వాతే నాకు ఈ నిబంధనలన్నీ గుర్తుకువచ్చాయి. వారెంట్ లాంటివి ఏమీ లేకుండా ఎలా వస్తారని అప్పుడు అనిపించింది" అని కొమ్మినేని తెలిపారు.

ఈ సంఘటన వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని కొమ్మినేని శ్రీనివాసరావు ఆరోపించారు. "సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఎన్టీవీలో పనిచేస్తున్నప్పుడు అమరావతి భూ సమీకరణపై, వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించాను. ప్యాకేజీ బాగానే ఉందని కూడా చెప్పాను. అప్పటి నుంచే నాపై కక్ష పెంచుకున్నారు. ఇప్పుడు సాక్షిలో డిబేట్లు నిర్వహిస్తున్నందున, నాలాంటి వారిని నిశ్శబ్దం చేయాలనేది వారి ఉద్దేశం కావచ్చు. రెడ్ బుక్ అంటూ ఏవో ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ నాపై కక్ష సాధింపు చర్యల్లో భాగమే" అని ఆయన అన్నారు. తాను ఎన్నడూ "అమరావతి మహిళలు" అనే పదాన్ని ఉపయోగించలేదని, కావాలనే తనపై తప్పుడు కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ 70 ఏళ్ల వయసులో ప్రభుత్వం నాపై ఎందుకింత కక్ష కట్టిందో అర్థం కావడం లేదు. ఇది దురదృష్టకరం" అని కొమ్మినేని వ్యాఖ్యానించారు.

పోలీసులు కనీస నిబంధనలు కూడా పాటించలేదని కొమ్మినేని అన్నారు. "స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి, లేదా కనీసం స్థానిక కానిస్టేబుల్ అయినా వెంట ఉండాలి. అలాంటివేమీ జరగలేదు. ఐడీ కార్డులు చూపించి రమ్మంటే ఎలా? ఫిర్యాదు ఎవరు ఇచ్చారని అడిగితే తుళ్లూరు ప్రజలు అంటున్నారు. ప్రజలంటే ఎవరు? టీడీపీ కార్యకర్తలా? స్పష్టంగా చెప్పాలి కదా? ఎవరికి నష్టం జరిగిందో చెప్పాలి" అని ఆయన ప్రశ్నించారు. "నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై, వాటిని లక్షల కాపీల్లో ప్రచురించిన పత్రికలపై, వందల నిమిషాలు ప్రసారం చేసిన టీవీలపై కేసులు పెట్టాలి. ఏమీ అనని నాపై కేసు పెట్టడం అన్యాయం" అని కొమ్మినేని పేర్కొన్నారు.

ఈ పరిణామాలతో తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని కొమ్మినేని తెలిపారు. "నా భార్య ఏడుస్తూ ఉంది. మా అబ్బాయి మాదాపూర్ నుంచి హుటాహుటిన వచ్చాడు. ఈ తలనొప్పి ఎందుకని వారు ఆందోళన చెందుతున్నారు. కానీ జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఆయన అన్నారు. "రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, చంద్రబాబు గారికి, లోకేశ్ గారికి కోపం వస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. రాజ్యాంగం, చట్టం ఏమీ ఉండవు. అయినప్పటికీ, నేను పూర్తిగా సహకరిస్తానని పోలీసులకు చెప్పాను. వాస్తవాలను ఎదుర్కోవాలి" అని కొమ్మినేని వివరించారు. ఈ మొత్తం వ్యవహారం తనను మానసికంగా ఇబ్బంది పెట్టడానికేనని, దీని వెనుక స్పష్టమైన కుట్ర ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
Kommineni Srinivasa Rao
Kommineni
Sakshi TV
Tulluru
Amaravati land pooling
AP Police
false case
political vendetta
Chandrababu Naidu
NTV

More Telugu News