Malaysia Bus Accident: మలేసియాలో ఘోర ప్రమాదం.. బస్సు, వ్యాన్ ఢీ, 15 మంది దుర్మరణం

Malaysia Bus Accident 15 Dead in East West Highway Crash
  • అదుపుతప్పిన బస్సు వ్యాన్‌ను ఢీకొట్టడంతో దుర్ఘటన
  • ప్రమాదంలో మరో 33 మందికి గాయాలు, ఏడుగురి పరిస్థితి విషమం
  • మృతుల్లో 14 మంది యూనివర్సిటీ విద్యార్థులే
ఉత్తర మలేసియాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థులతో క్యాంపస్‌కు వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక మినీవ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు సిబ్బంది సహా 15 మంది మరణించగా, మరో 33 మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్ సరిహద్దు సమీపంలోని ఈస్ట్-వెస్ట్ హైవేపై గెరిక్ పట్టణం వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. మలేసియాలో గత పదేళ్లలో ఇదే అత్యంత ఘోరమైన ప్రమాదమని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో 14 మంది విద్యార్థులేనని చెప్పారు.

బస్సు అదుపుతప్పి మినీవ్యాన్‌ ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆకుపచ్చ రంగు బస్సు కుడివైపునకు బోల్తాపడి వెనుక భాగం నుజ్జునుజ్జు కాగా, ఎరుపు రంగు మినీవ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. "కొంతమంది బాధితులు స్వయంగా బయటపడగా, మరికొందరు బయటకు విసిరివేయబడ్డారు. ఇంకొందరు బస్సులోనే చిక్కుకుపోయారు" అని చెప్పారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు హైడ్రాలిక్ కట్టర్‌ను ఉపయోగించాల్సి వచ్చిందని తెలిపారు.

మృతుల్లో సుల్తాన్ ఇద్రిస్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి చెందిన 14 మంది విద్యార్థులతో పాటు బస్సు అటెండెంట్ ఉన్నారని అత్యవసర సేవల విభాగం ధృవీకరించింది. గాయపడిన 33 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా 21 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులే. ఈశాన్య మలేసియాలోని జెర్తే పట్టణం నుంచి నిన్న వీరు బయలుదేరగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

Malaysia Bus Accident
East-West Highway
Gerik
Sultan Idris Education University
Road Accident
Bus Crash
Mini Van Collision
University Students
Thailand Border

More Telugu News