Chandrababu Naidu: ఒక్కొక్క కార్యాలయానికి రూ.10 లక్షలు ఇస్తాం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces Rs 10 Lakh for Each Constituency Office
  • స్వర్ణాంధ్ర-2047 విజన్ అమలుకు సీఎం చంద్రబాబు శ్రీకారం
  • 26 జిల్లా, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటు
  • ప్రతి యూనిట్ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయింపు
  • నియోజకవర్గ యూనిట్‌కు ఎమ్మెల్యే ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో బృందం
  • వచ్చే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని సీఎం ధీమా
  • ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత లక్ష్యం
స్వర్ణాంధ్ర-2047' లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గ కేంద్రాల్లో 'విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' కార్యాలయాలను సోమవారం సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యూనిట్లు స్వర్ణాంధ్ర విజన్ అమలుకు పటిష్టమైన పునాది వేస్తాయని, శాసనసభ్యులకు ప్రభుత్వపరంగా ప్రత్యేక కార్యాలయాల లోటును తీరుస్తాయని సీఎం పేర్కొన్నారు.

యూనిట్ల నిర్మాణం - నిధులు

ప్రతి నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఈ యూనిట్లు పనిచేస్తాయి. జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ/వార్డు సచివాలయాలకు చెందిన ఐదుగురు విజన్ స్టాఫ్ కలిపి మొత్తం తొమ్మిది మంది సభ్యులుంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.

స్వర్ణాంధ్ర లక్ష్యాలు - జాతీయ దృక్పథం

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, రెండేళ్లలో మూడో స్థానానికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 'వికసిత్ భారత్-2047'కు అనుబంధంగా 'స్వర్ణాంధ్ర-2047' విజన్‌ను రూపొందించామని తెలిపారు. పేదరిక నిర్మూలన, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత వంటి పది సూత్రాలతో కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం గల భారతీయుల్లో 30% తెలుగువారేనని, ఈ ప్రగతిని కొనసాగించాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమ హామీలు

ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని, 'తల్లికి వందనం' ఈ నెలలోనే ప్రారంభించి, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. దీపం పథకం లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తామన్నారు. పోలవరం 2027 నాటికి, అమరావతి 2028కి, భోగాపురం విమానాశ్రయం 2026 నాటికి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైళ్లు, విశాఖ రైల్వే జోన్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగవంతం చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, కేంద్ర సహకారంతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించగా సీఎం అభినందించారు.
Chandrababu Naidu
Swarnandhra Vision 2047
Andhra Pradesh
Vision Action Plan Unit
AP Development
Poverty Reduction
Employment AP
Skill Development
Water Security
TDP Government

More Telugu News