Jagan: 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేనిని అరెస్ట్ చేయడం కక్షసాధింపులకు పరాకాష్ఠ: జగన్

Jagan Condemns Arrest of Kommineni as Political Vendetta
  • సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌
  • తీవ్ర స్థాయిలో స్పందించిన జగన్
  • ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు
  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని విమర్శ
  • ఐదేళ్లలో ఒక ఏడాది గడిచిపోయిందని వెల్లడి
  • మరో నాలుగేళ్ల తర్వాత అన్నింటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టీకరణ
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, భిన్నాభిప్రాయాలను అణచివేస్తోందని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని విమర్శలు గుప్పించారు. కొమ్మినేని అరెస్టు ఈ కోవలో జరిగిన కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు.

"ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబు గారు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. 

తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా? 

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. 

కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి" అంటూ జగన్ హెచ్చరించారు.
Jagan
YS Jagan
Kommineni Srinivasa Rao
Kommineni Arrest
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Journalist Arrest
Freedom of Press
Political Vendetta

More Telugu News