Mudragada Padmanabham: నా మనవళ్లను, మనవరాళ్లను రాజకీయాల్లోకి తెచ్చి ముఖ్యమంత్రిని చేస్తా: ముద్రగడ

Mudragada Vows to Bring Grandchildren into Politics and make Chief Minister
  • ముద్రగడ పద్మనాభం కుటుంబంలో బహిర్గతమైన విభేదాలు
  • కూతురు క్రాంతి ఆరోపణలను ఖండించిన ముద్రగడ
  • కుమారుడు గిరి వల్లే తను ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడి
  • గిరి రాజకీయ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్య
  • మనవళ్లను కూడా రాజకీయాల్లోకి తెచ్చి ముఖ్యమంత్రిని చేస్తానన్న పద్మనాభం
  • ఎన్ని జన్మలెత్తినా కూతురి ఇంటి గడప తొక్కనని స్పష్టం
కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబంలో నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆయన కుమార్తె క్రాంతి చేసిన ఆరోపణలపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ఓ బహిరంగ లేఖ ద్వారా తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

తన కుమార్తె క్రాంతి జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి తండ్రీకూతుళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఇటీవల, తన తండ్రి ముద్రగడ పద్మనాభంను ఆయన కుమారుడు గిరి నిర్బంధించారని, క్యాన్సర్ చికిత్సకు కూడా ఆటంకం కలిగిస్తున్నారని క్రాంతి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. తన తండ్రి సంరక్షణ తనకు ఎంతో అవసరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలపై ముద్రగడ పద్మనాభం తీవ్రంగా స్పందించారు. కుమార్తె పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడని ఆయన, ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో, తన కుమార్తె చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. "ఒక కుటుంబం నా కుటుంబంపై కుట్రలు పన్నుతోంది" అని ఆయన మండిపడ్డారు. తన చిన్న కుమారుడు గిరి వల్లే తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, అతని సంరక్షణలోనే ఉన్నానని స్పష్టం చేశారు.

"మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. ఓర్వలేకపోతున్నారు, రగిలిపోతున్నారు. వాళ్లకు వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వస్తే తప్పేంటి? మేమేమైనా వారిని డబ్బులు అడిగామా? వారి సాయం కోరామా? ఏమీ లేదే, వాళ్లకు సంబంధం ఏంటి?" అని ముద్రగడ ప్రశ్నించారు. కొందరు తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతటితో ఆగకుండా, "నా మనవళ్లను, మనవరాళ్లను కూడా రాజకీయాల్లోకి దింపుతాను. వాళ్లను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళతాను" అని ముద్రగడ సంచలన ప్రకటన చేశారు. తన కుమారుడికి, వియ్యంకుడికి, తనకు మధ్య విభేదాలు సృష్టించాలనే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. "నా కొడుక్కి నాకు మనస్పర్థలు పెంచి దూరం చేస్తే, వాళ్ల గడప తొక్కుతానని అనుకుంటున్నారు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా వాళ్ల గుమ్మం ఎక్కను" అని ఆయన తీవ్ర స్వరంతో తేల్చిచెప్పారు.
Mudragada Padmanabham
Mudragada
Kranthi
Giri
YSR Congress Party
Janasena Party
Andhra Pradesh Politics
Kapu Movement
Family Disputes
Political Aspirations

More Telugu News