PSR Anjaneyulu: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. ఐపీఎస్ ఆంజనేయులుకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ

High Court Denies Bail to PSR Anjaneyulu in APPSC Irregularities Case
  • ఐపీఎస్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, మధుసూదన్‌కు చుక్కెదురు
  • ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ అక్రమాల కేసులో  ఇద్దరి బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు
  • ఆరోపణల తీవ్రత, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటంతో బెయిల్ నిరాకరణ
  • ఆరోగ్య కారణాలతో మెడికల్ బెయిల్ కోసం విజయవాడ కోర్టును ఆశ్రయించేందుకు పీఎస్‌ఆర్ కు వెసులుబాటు
  • రెండు వారాల్లోగా ఆంజనేయులు మెడికల్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని విజయవాడ కోర్టుకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, క్యామ్‌సైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్‌కు హైకోర్టులో నిరాశ ఎదురైంది. వీరిద్దరూ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. కేసు తీవ్రత, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులు (ఏ1), మధుసూదన్ (ఏ2) ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తొలుత ట్రయల్ కోర్టు వీరి బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులపై ఉన్న ఆరోపణల తీవ్రత, నేరం రుజువైతే పడే శిక్ష, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం వంటి అంశాలను బెయిల్ మంజూరు చేసే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, పిటిషనర్లపై ఉన్న నేర స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సాయి రోహిత్ వాదనలు వినిపిస్తూ, ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో పీఎస్‌ఆర్ ఆంజనేయులు హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మ్యాన్యువల్ మూల్యాంకనం చేయించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందుకోసం క్యామ్‌సైన్ సంస్థకు రూ.1.14 కోట్లు చెల్లించారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని కోర్టుకు వివరించారు.

అనారోగ్య కారణాలు చూపుతూ పీఎస్‌ఆర్ ఆంజనేయులు తరఫు న్యాయవాది బెయిల్ కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, "రికార్డులను పరిశీలించగా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పీఎస్‌ఆర్‌ను తమ పర్యవేక్షణలో ఉండాలని కోరారు. అయితే, ఆయన నిరాకరించి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో, రెండు వారాల మెడికల్ బెయిల్ కోరుతూ విజయవాడ మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పీఎస్‌ఆర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నాం" అని తీర్పులో పేర్కొన్నారు.

మెడికల్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) నుంచి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితిపై తాజా నివేదిక తెప్పించుకోవాలని విజయవాడ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ వ్యాజ్యాన్ని రెండు వారాల్లోగా పరిష్కరించాలని సూచించింది. ఏ2 నిందితుడిగా ఉన్న మధుసూదన్ బెయిల్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. 
PSR Anjaneyulu
APPSC
APPSC Scam
High Court
Bail Petition
Madhusudan
Group 1
Andhra Pradesh Public Service Commission
Camshine Private Limited

More Telugu News