Chandrababu Naidu: ఎన్‌హెచ్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu Naidu comments on NH projects in Andhra Pradesh
  • జాతీయ రహదారుల ప్రాజెక్టు పనుల జాప్యంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
  • నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే ఆ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరతానన్న సీఎం చంద్రబాబు
  • గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం జరగాల్సిందేనని స్పష్టీకరణ
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైన అనుమతులు మంజూరు చేసి, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ, ఎటువంటి ఆటంకాలు లేకున్నా పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇకపై గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణం పూర్తికావాల్సిందేనని ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టులపై అధికారులు, కాంట్రాక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం చేస్తే సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

బెంగళూరు - కడప - విజయవాడ జాతీయ రహదారిలో భాగమైన కోడూరు క్రాస్ - కడప - ముప్పవరం ప్యాకేజీలో పనులు ఆలస్యంగా జరగడం, మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇకపై ఏ రహదారి నిర్మాణంలోనూ ఆలస్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులు తదితర సమస్యలను జులై నాటికి పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
National Highways
NH Projects
Road Construction
Vijayawada
Kadapa
AP CM
Infrastructure Projects
Road Development

More Telugu News