Lanka Dinakar: ఆ మీడియా సంస్థకు అక్రమంగా రూ.96 కోట్లు చెల్లింపులు: లంకా దినకర్

Lanka Dinakar Alleges Illegal Payments of 96 Crore to Media House
  • కేంద్రం 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ఇస్తే 1.40 లక్షలే లబ్దిదారులకు ఇచ్చారు: లంకా దినకర్ 
  • జల్ జీవన్ మిషన్ లోనూ అక్రమాలు జరిగాయన్న లంకా దినకర్
  • రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్న దినకర్ 
గత ప్రభుత్వ హయాంలో పథకాల సర్వే పేరుతో వై మీడియా అనే సంస్థకు రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించారని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తామన్నారు.

వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల అమలుతీరుపై అన్ని జిల్లాల అధికారులతో సమీక్షలు పూర్తి చేశామని చెప్పారు. గత అయిదేళ్లలో కేంద్రం 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వగా, 1.40 లక్షలే లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. అందులోనూ నివసిస్తున్నది 87 వేల మంది మాత్రమేనని తెలిపారు.

జల్ జీవన్ మిషన్ లోనూ అవినీతి అక్రమాలకు పాల్పడి, నాణ్యత లేకుండా పనులు చేసి దోచుకున్నారని ఆరోపించారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజా సహకార పాలన సాగిస్తున్నదని, పెట్టుబడి దారులు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడుతున్నారన్నారు. ఇప్పటి వరకు రూ.9.34 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు ఈ ఒక్క సంవత్సరం కూటమి పాలనలో జరిగాయన్నారు. 25 లక్షల మందికి ఉద్యోగాల కల్పన రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తోందన్నారు.

రాజధాని అమరావతి నిర్మాణం, 120 బిలియన్ డాలర్ల ఆర్థిక స్వావలంబన దిశగా విశాఖ రీజియన్ అభివృద్ధి, బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి మొదటి దశ పూర్తి, కొపర్తి-ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, బీపీసీఎల్ పెట్రో కాంప్లెక్స్ - సోలార్ ప్యానల్ తయారీ పరిశ్రమ మరియు రామాయపట్నం ఓడరేవు నిర్మాణం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తించడమైందన్నారు. కేంద్ర పథకాలకు, ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్లు సానుకూలంగా పెడుతుందని ఆయన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత భారత్‌లో ఏపీని భాగస్వామ్యం చేయడానికి స్వర్ణాంధ్ర సాధన దిశగా నేడు 2.40 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారన్నారు. 
Lanka Dinakar
Andhra Pradesh
YS Jagan
Chandrababu Naidu
TIDCO houses
Jal Jeevan Mission
Amaravati
Polavaram Project
AP government schemes
corruption allegations

More Telugu News