Online Maps: ఆన్ లైన్ మ్యాప్స్ చూస్తూ వెళ్లి గాల్లో వేలాడారు!

Online Maps Lead Car to Hang Off Unfinished Flyover in Uttar Pradesh
  • యూపీలో మరోసారి ఆన్‌లైన్ మ్యాప్స్ తప్పిదం.. ఫ్లైఓవర్‌పై నుంచి పడబోయిన కారు
  • నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పైకి దూసుకెళ్లి వేలాడిన వాహనం
  • సురక్షితంగా బయటపడ్డ కారులోని ప్రయాణికులు
ఆన్ లైన్ మ్యాప్స్ వచ్చాక కొత్త ప్రదేశంలో దారి కోసం వెతుక్కునే శ్రమ తప్పింది. వాహనంలోనే మ్యాప్స్ చూస్తూ గమ్యం చేరుకోవచ్చు. అయితే, ఈ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మ వద్దని తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తోంది. మ్యాప్ లో గమ్యం ఫీడ్ చేసి, అది చూపించిన మార్గంలో గుడ్డిగా వెళితే ఒక్కోసారి ప్రమాదంలో పడతామని హెచ్చరిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఆన్‌లైన్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడపడంతో అదికాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి తీసుకెళ్లింది.

ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఈ ఘటన జాతీయ రహదారి 24పై జరిగింది. అదృష్టవశాత్తూ కారులోని వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ ఆన్‌లైన్ మ్యాప్ సూచనలను అనుసరిస్తూ వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ను మ్యాప్ గుర్తించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లో గతేడాది కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే, అది విషాదంగా ముగిసింది. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్న ఓ కారు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని దాతాగంజ్‌కు వెళ్తుండగా ఫరీద్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దెబ్బతిన్న వంతెన గురించి గూగుల్ మ్యాప్స్‌లో సమాచారం లేకపోవడంతో, డ్రైవర్ కారును దానిపైకి నడిపాడు. దీంతో వాహనం దాదాపు 50 అడుగుల లోతున్న నదిలో పడిపోయింది.
Online Maps
Uttar Pradesh
Car accident
Google Maps
Flyover
Road accident
Maharajganj
Navigation error

More Telugu News