Chandrababu Naidu: నేరగాళ్లకు వణుకు పుట్టాలి: పోలీసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu orders strict action against criminals
  • గంజాయి ముఠాల అణచివేతకు పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ
  • అనంతపురం ఘటనలపై తీవ్ర ఆవేదన, నిందితులకు వెంటనే శిక్షలు పడేలా చర్యలు
  • మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచన
  • గత ప్రభుత్వంలో నేరగాళ్లపై నియంత్రణ కొరవడిందని సీఎం వ్యాఖ్య
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, గంజాయి ముఠాల ఆగడాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వంద శాతం మార్పు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఇతర ఉన్నతాధికారులతో శాంతిభద్రతల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఇటీవల అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, రామగిరి మండలంలో బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్న ఆయన, నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, ట్రయల్స్ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్కా ఆధారాలు సేకరించి, నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని తెలిపారు. "ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలి" అని సీఎం అన్నారు.

గత ఐదేళ్లలో నేరగాళ్లపై సరైన నియంత్రణ లేకపోవడం, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉదాసీనత వల్లే నేరగాళ్లు రెచ్చిపోయారని, ఆ పాత అలవాట్లను కొందరు ఇంకా మానడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే ముందస్తుగా అదుపులోకి తీసుకుని హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు.

ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లాలో యువతి హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఘటనపై తీసుకున్న చర్యలను మూడు రోజుల్లోగా నివేదించాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై కొన్నేళ్లుగా అత్యాచారం జరుగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, పరారీలో ఉన్న మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ తెలిపారు.
Chandrababu Naidu
Andhra Pradesh police
crime control
women safety
Anantapur crime
rape case
ganja mafia
AP DGP
National Women Commission
crime investigation

More Telugu News