Harsh Jain: మస్క్ గారూ ఇదేం న్యాయం? టెస్లాపై డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్ అసహనం!

Dream 11 CEO Slams Elon Musks Tesla For Returning His 1000 Booking Amount
  • 8 ఏళ్ల క్రితం బుక్ చేసిన మోడల్ 3 కారు డబ్బులు వాపస్
  • పాత మోడల్ 3 ఇప్పుడు లైనప్‌లో లేదని టెస్లా ప్రకటన
  • ప్రాధాన్యతా స్లాట్ కూడా రద్దు చేయడంపై జైన్ అసంతృప్తి
  • భారత్‌లో టెస్లా ప్రవేశానికి ముందే అభిమానుల్లో నిరాశ
ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 సీఈఓ హర్ష్ జైన్, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం టెస్లా మోడల్ 3 కారు కోసం తాను చెల్లించిన వెయ్యి డాల‌ర్లు (సుమారు రూ. 83,000) బుకింగ్ మొత్తాన్ని కంపెనీ ఇప్పుడు తిరిగి చెల్లించడంపై ఆయన మండిపడ్డారు. ఎంతోకాలంగా టెస్లా కార్ల కోసం ఎదురుచూస్తున్న భారతీయ కస్టమర్ల నమ్మకాన్ని, సహనాన్ని టెస్లా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... టెస్లా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తుందన్న ఆశతో హర్ష్ జైన్ 2017లోనే మోడల్ 3 కారును రిజర్వ్ చేసుకున్నారు. అనేక సంవత్సరాల జాప్యం తర్వాత టెస్లా ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హర్ష్ జైన్‌కు టెస్లా నుంచి ఊహించని సమాచారం అందింది. ఆయన బుక్ చేసుకున్న ప్రత్యేకమైన మోడల్ 3 కారు ఇప్పుడు తమ గ్లోబల్ లైనప్‌లో లేదని, అందువల్ల ఆయన ప్రాధాన్యతా స్లాట్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు టెస్లా తెలిపింది. బుకింగ్ సమయంలో చెల్లించిన మొత్తాన్ని ఆయన అసలు పేమెంట్ పద్ధతికి రీఫండ్ చేస్తామని కూడా కంపెనీ తెలియజేసింది.

ఈ పరిణామంపై హర్ష్ జైన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. టెస్లా నుంచి వచ్చిన సందేశం స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ... "వావ్ ఎలాన్ మస్క్, టెస్లా భారత్‌లోని తన అభిమానులను, తొలి మద్దతుదారులను ద్వేషించేలా మార్చుతోందని మీకు తెలుసా? దాదాపు 10 ఏళ్ల తర్వాత టెస్లా ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెడుతుంటే, వాళ్లు నాకు కేవలం వెయ్యి డాల‌ర్లు తిరిగి ఇచ్చి, నా ప్రాధాన్యతా స్లాట్‌ను కూడా తీసివేస్తారా?" అని ప్రశ్నించారు.

ఇక‌, భారత్‌లో టెస్లా ప్రవేశం అనేక నియంత్రణపరమైన అడ్డంకులు, మారుతున్న మార్కెట్ వ్యూహాల కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే కంపెనీ అధికారికంగా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించనుందన్న ప్రకటనతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, హర్ష్ జైన్ వంటి తొలి మద్దతుదారులు మాత్రం తమ సహనానికి తగిన గుర్తింపు లభించలేదని, ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

హర్ష్ జైన్ చేసిన విమర్శలపై టెస్లా ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ఈ ఘటన సుదీర్ఘకాలం ఎదురుచూసిన భారతీయ కస్టమర్ల పట్ల టెస్లా వైఖరిని ప్రశ్నించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Harsh Jain
Dream11
Tesla
Elon Musk
Tesla Model 3
India
Electric Cars
Car Booking
Refund
Customer Dissatisfaction

More Telugu News