Sonam: హనీమూన్ హత్య కేసు: ఆ బాయ్‌ఫ్రెండ్‌కు నా సోదరి రాఖీ కట్టేది.. సోనమ్ సోదరుడి కన్నీటి పర్యంతం!

Sonam Honeymoon Murder Case Brother Demands Justice
  • భర్త రాజా రాఘువంశీ హత్య కేసులో సోనమ్ కుటుంబం కీలక నిర్ణయం
  • సోనమ్‌ను కుటుంబం నుంచి బహిష్కరించినట్లు ప్రకటించిన సోదరుడు గోవింద్
  • ఆమె దోషి అయితే ఉరితీయాలని కన్నీటిపర్యంతమైన సోదరుడి అభ్యర్థన
  • ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు
  • రాజ్ కుష్వాహాకు సోనమ్ గత మూడేళ్లుగా రాఖీ కడుతోందన్న గోవింద్
  • సోనమ్ తరఫున రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పిన సోదరుడు
హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. గోవింద్ రాజారఘువంశీ ఇంటికి వెళ్లి, తమ కుటుంబం సోనమ్‌తో అన్ని సంబంధాలు తెంచుకుందని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ దోషి అని తేలితే ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేశారు.

బుధవారం ఇండోర్‌లోని రాజా రాఘువంశీ నివాసానికి వెళ్లిన గోవింద్, రాజా తల్లి ఉమా రాఘువంశీని కౌగిలించుకుని బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి.

మే 11న వివాహం చేసుకున్న సోనమ్ (24), రాజా (29) దంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లగా, పెళ్లయిన 12 రోజులకే, మే 23న రాజా హత్యకు గురయ్యారు. 21 ఏళ్ల రాజ్ కుష్వాహాతో సోనమ్‌కు ప్రేమ వ్యవహారం ఉందని, అతడి స్నేహితుల సహాయంతో ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. సోనమ్ ఇప్పటికే నేరం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

రాజా సోదరుడు విపిన్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన గోవింద్, "సోనమ్ ఈ హత్య వెనుక ఉందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ, బయటకు వస్తున్న సాక్ష్యాధారాలు చూస్తుంటే, ఆమెనే ఈ దారుణం చేయించిందనిపిస్తోంది. ఈ కేసులో వినిపిస్తున్న మిగతా నిందితుల పేర్లన్నీ రాజ్ కుష్వాహాకు సంబంధించినవే" అని తెలిపారు.

"నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నా చెల్లెల్ని ఈ కుటుంబానికి ఇచ్చాను, ఇప్పుడు నేను కూడా ఈ కుటుంబంలో భాగమే. మా కుటుంబం సోనమ్‌తో అన్ని బంధాలు తెంచుకుంది. రాజా అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ సోనమ్ దోషి అయితే, ఆమెను తప్పకుండా ఉరితీయాలి" అని గోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, రాజ్ కుష్వాహా ఎప్పుడూ సోనమ్‌ను 'దీదీ' (అక్క) అని పిలిచేవాడని, గత మూడేళ్లుగా సోనమ్ అతడి చేతికి రాఖీ కూడా కడుతోందని గోవింద్ చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. "రాజ్ కుష్వాహా తల్లికి వీరి మధ్య సంబంధం గురించి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాడు ఎప్పుడూ నా సోదరిని అక్క అనే పిలిచేవాడు. వాడు నా పక్కనే కూర్చుంటే, మా ఇద్దరి చేతులకు ఆమె రాఖీ కట్టేది" అని గోవింద్ వివరించారు. రాజ్ కుష్వాహా గత రెండు, మూడు సంవత్సరాలుగా తమ ప్లైవుడ్ ఫ్యాక్టరీని, కస్టమర్ వ్యవహారాలను చూసుకుంటున్నాడని తెలిపారు.
Sonam
Honeymoon murder case
Raja Raghuvanshi
Raj Kushwaha
Indore
Crime news

More Telugu News