Jagan Mohan Reddy: జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ రాళ్ల దాడి.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

YSRCP Stone Pelting During Jagan Visit Chandrababu Angered
  • పొదిలిలో మహిళలు, పోలీసులపై జరిగిన దాడిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
  • ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశం
  • మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా పొదిలిలో ఉద్రిక్త పరిస్థితులు
  • రైతుల పరామర్శ పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తారా అని జగన్‌పై సీఎం ఫైర్
  • సాక్షి టీవీలో అమరావతి రైతులపై కథనాల వివాదం నేపథ్యంలో నిరసనలు
  • నిరసనకారులపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో పలువురికి గాయాలు
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆయన ఆదేశించారు. రైతుల పరామర్శ పేరుతో పర్యటనకు వెళ్లి శాంతిభద్రతల సమస్యలను సృష్టించడం ఏమిటని జగన్‌పై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పొదిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా, అమరావతి రైతులు, మహిళలను కించపరిచేలా సాక్షి టీవీలో చర్చా కార్యక్రమం ప్రసారం చేశారంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. సాక్షి ఛైర్‌పర్సన్, జగన్ సతీమణి భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే, జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలోనూ కొందరు నిరసన తెలిపారు. పొదిలి మెయిన్ రోడ్డు సెంటర్‌లో జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్న రైతులు, మహిళలపై రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పలువురు మహిళలతో పాటు కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించింది.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతుల పరామర్శ పేరుతో వెళ్లి ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. రైతుల కోసం వెళ్లినప్పుడు జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ ఎందుకు చేశారని నిలదీశారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే, దాన్ని అలుసుగా తీసుకుని దుర్వినియోగం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఉపేక్ష వద్దని స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
Chandrababu Naidu
YSRCP
TDP
Andhra Pradesh Politics
Podili

More Telugu News