Dil Raju: డబ్బులిచ్చి వ్యూస్ కొనడం ఇకపై ఆపేస్తా: దిల్ రాజు సంచలన ప్రకటన

Dil Raju Announces No More Paid YouTube Views for His Films
  • యూట్యూబ్ ఫేక్ వ్యూస్ కొనడం ఆపేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటన
  • "తమ్ముడు" సినిమా నుంచే ఈ నిర్ణయం అమలులోకి
  • కంటెంట్ జెన్యూన్ రీచ్ తెలుసుకునేందుకే ఈ చర్య అని వెల్లడి
  • పీఆర్ టీమ్‌కు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడి
  • ఇలాంటి విషయాలపై మీడియా ప్రశ్నించాలన్న దిల్ రాజు
  • మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న కొన్ని విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, సినిమాల ప్రచారంలో యూట్యూబ్ వ్యూస్‌ను కృత్రిమంగా పెంచుకునే పద్ధతిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై తమ బ్యానర్‌లో నిర్మించే సినిమాలకు డబ్బులు చ్చించి ఫేక్ యూట్యూబ్ వ్యూస్‌ను కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న "తమ్ముడు" సినిమా నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, "మా సినిమా ట్రైలర్ లేదా పాట ఎంత మందికి వాస్తవంగా చేరుతుందో తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వ్యూస్ కొంటే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కానీ, అది నిజమైన ప్రేక్షకాదరణ కాదు. కంటెంట్ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయిందో అర్థం కాదు. అందుకే, నా పీఆర్ టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇకపై మన సినిమాలకు వ్యూస్ కొనవద్దు అని చెప్పాను. 'తమ్ముడు' సినిమాతో ఈ పద్ధతిని ప్రారంభిస్తున్నాం," అని తెలిపారు.

విషయం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని ఆయన నొక్కి చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా విజయాన్ని ఉదాహరణగా చూపుతూ, మంచి కంటెంట్ అందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి అదే నిదర్శనమన్నారు. "సినిమాలో విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు. లేకపోతే తిరస్కరిస్తారు. మన కంటెంట్ ఎంత రీచ్ అవుతుందో తెలిసినప్పుడే, ఎక్కడ లోపం ఉందో అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది," అని దిల్ రాజు వివరించారు.

ఇలాంటి ఫేక్ వ్యూస్ వ్యవహారాలపై మీడియా కూడా దృష్టి సారించి, బాధ్యులైన వారిని ప్రశ్నించాలని ఆయన సూచించారు. "మీడియా మిత్రులు ఇలాంటి విషయాలపై ఎందుకు ప్రశ్నించరో నాకు అర్థం కాదు. ఫాల్స్ ప్రమోషన్లను ఆపడానికి ప్రయత్నిస్తేనే ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది," అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఆ స్థానాన్ని కాపాడుకోవాలంటే అందరూ కలిసికట్టుగా మంచి కంటెంట్‌ను అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
Dil Raju
Telugu cinema
fake views
YouTube views
Thammudu movie
Nithin
movie promotions
content reach
PR team
Sankranthi ki Vasthunnam

More Telugu News