Nikhil Siddhartha: నిఖిల్ సినిమా సెట్‌లో ప్రమాదం.. పలువురికి గాయాలు

Nikhil Siddhartha The Indian House Movie Set Mishap
  • నిఖిల్ 'ది ఇండియన్ హౌస్' సినిమా సెట్‌లో ప్రమాదం
  • శంషాబాద్ సమీపంలో చిత్రీకరణ సమయంలో కూలిన వాటర్ ట్యాంక్
  • సముద్రపు సన్నివేశం కోసం ఏర్పాటు చేసిన భారీ ట్యాంక్ 
  • తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ అసిస్టెంట్ కెమెరామెన్‌.. మరికొందరికి కూడా గాయాలు
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది ఇండియన్ హౌస్' షూటింగ్‌లో నిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు సాంకేతిక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది.

వివరాల్లోకి వెళితే... 'ది ఇండియన్ హౌస్' సినిమాలోని ఒక కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ సముద్రపు నేపథ్యాన్ని సృష్టించేందుకు ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్‌ను నిర్మించింది. నిన్న ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. 

ఈ ప్ర‌మాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయని, మరికొంతమంది సిబ్బంది కూడా గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రమాదం జరిగిన సమయంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ సెట్‌లో ఉన్నారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. వాటర్ ట్యాంక్ కూలిన తర్వాత సెట్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ఇండియన్ హౌస్' చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, తేజ్ నారాయణ్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రమాదానికి గురైన సన్నివేశం కోసం పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగించాల్సి రావడం, దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భద్రతాపరమైన సవాళ్లు కూడా ఎదురై ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Nikhil Siddhartha
The Indian House
Nikhil movie accident
Ram Vamsi Krishna
Abhishek Agarwal
Tej Narayan Agarwal
Hyderabad movie set
Tollywood accident
movie shooting accident
Shamsabad

More Telugu News