KGBV: కేజీబీవీ టాయిలెట్‌లో భారీ కొండచిలువ కలకలం

KGBV School Toilet Huge Python Creates Panic in Hanumakonda
  • హనుమకొండ జిల్లా కమలాపూర్‌ కేజీబీవీలో కొండచిలువ ప్రత్యక్షం
  • బాలికల వసతిగృహం మూత్రశాలలో పామును గుర్తించిన సిబ్బంది
  • సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువతో కలకలం
  • పట్టుకొని సమీప అడవిలో విడిచిపెట్టిన అటవీశాఖ అధికారులు
హనుమకొండ జిల్లాలోని ఓ పాఠశాల విద్యార్థినులు బుధవారం ఉదయం ఊహించని రీతిలో భయాందోళనలకు గురయ్యారు. తాము రోజూ ఉపయోగించే టాయిలెట్‌లోనే ఓ భారీ కొండచిలువ కనిపించడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న‌ ఉదయం పాఠశాలలోని బాలికల వసతిగృహానికి చెందిన ఓ మ‌రుగుదొడ్డిలో సుమారు 10 అడుగుల పొడవున్న కొండచిలువను సిబ్బంది గుర్తించారు. కేజీబీవీ ఎస్ఓ అర్చ‌న‌, ఉపాధ్యాయులు పారిశుద్ధ్య కార్మికుల‌తో మ‌రుగుదొడ్ల‌ను శుభ్రం చేయిస్తున్న స‌మ‌యంలో ఓ టాయిలెట్‌లో ఈ భారీ కొండ‌చిలువ క‌నిపించింది. 

వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బీట్ అధికారి అశోక్‌, హ‌నుమకొండ‌లోని జూపార్క్ సిబ్బంది హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. వారు ఎంతో చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. అటవీశాఖ అధికారులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవడంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.
KGBV
Kasturba Gandhi Balika Vidyalaya
Hanumakonda
Kamalapur
Python
Snake in Toilet
Forest Department
Zoo Park Hanumakonda
Telangana News
School Students

More Telugu News