Indian Railways: రైల్వేశాఖ కొత్త నిబంధన.. తత్కాల్ బుకింగ్‌కు ఇక ఆధార్ తప్పనిసరి

Indian Railways Tatkal Booking Aadhar Mandatory From July 1
  • జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి
  • ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ ద్వారా బుకింగ్‌కు ఈ నిబంధన వర్తింపు
  • జూలై 15 నుంచి ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ కూడా అమలు
  • పీఆర్ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా బుకింగ్‌కు కూడా ఓటీపీ అవసరం
  • తత్కాల్ బుకింగ్ ప్రారంభ సమయాల్లో ఏజెంట్లకు కొన్ని పరిమితులు
తత్కాల్ పథకం ద్వారా టికెట్లు బుక్ చేసుకునే విధానంలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక మార్పులు తీసుకువచ్చింది. జులై 1 నుంచి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది.

తత్కాల్ పథకం ప్రయోజనాలు సాధారణ ప్రయాణికులకు పూర్తిగా అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తన సర్క్యులర్‌లో పేర్కొంది. "జూలై 1వ తేదీ నుంచి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్ లేదా దాని యాప్ ద్వారా తత్కాల్ పథకం కింద టికెట్లను కేవలం ఆధార్ ధ్రువీకరణ పొందిన యూజర్లు మాత్రమే బుక్ చేసుకోగలరు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంతేకాకుండా, జులై 15వ తేదీ నుంచి తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) ధ్రువీకరణను కూడా తప్పనిసరి చేయనున్నారు. "రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్ల వద్ద లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయంలో యూజర్ అందించిన మొబైల్ నంబర్‌కు సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన ఓటీపీ వస్తుంది. దానిని ధ్రువీకరించిన తర్వాతే టికెట్లు జారీ చేయబడతాయి. ఈ విధానం కూడా జూలై 15 నుంచి అమల్లోకి వస్తుంది" అని సర్క్యులర్‌లో వివరించారు.

అలాగే, అధీకృత టికెటింగ్ ఏజెంట్లు తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల పాటు ఓపెనింగ్ డే టికెట్లను బుక్ చేయడానికి అనుమతించరు. ప్రత్యేకించి, ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) క్లాసులకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు, నాన్-ఏసీ క్లాసులకు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు వారు తత్కాల్ టికెట్లను బుక్ చేయకుండా పరిమితులు విధించారు.

ఈ మార్పులకు అనుగుణంగా సిస్టమ్‌లో అవసరమైన సవరణలు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (క్రిస్), ఐఆర్‌సీటీసీలను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మార్పుల గురించి అన్ని జోనల్ రైల్వేలకు తెలియజేయాలని కూడా సూచించింది. ప్రజలకు ఈ కొత్త నిబంధనలపై విస్తృతంగా ప్రచారం కల్పించి, వారికి అవగాహన కల్పిస్తామని కూడా సర్క్యులర్‌లో హామీ ఇచ్చారు.
Indian Railways
Tatkal booking
Aadhar authentication
IRCTC
Railway reservation
Tatkal ticket booking
Railway Ministry
OTP verification
Railway zones
Ticket agents

More Telugu News