Sonam: 'హనీమూన్ మర్డర్' కేసు: సోనమ్‌ను ఉరితీయాలి.. సొంత అన్నయ్య సంచలన వ్యాఖ్యలు

Sonam Should Be Hanged Says Brother in Honeymoon Murder Case
  • నిందితురాలితో కుటుంబ సంబంధాలు తెంచుకున్నట్టు వెల్లడి
  • సోనమ్‌ సహా ఐదుగురికి 8 రోజుల పోలీసు కస్టడీ
  • కామాఖ్య పూజల పేరిట భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన సోనమ్
  • హత్య జరిగినప్పుడు సోనమ్ అక్కడే ఉంది: నిందితుల వాంగ్మూలం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనీమూన్ హత్య’ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ సోదరుడు గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బావ రాజా రఘువంశీని తన చెల్లెలు సోనమే హత్య చేయించిందని తాను వందశాతం నమ్ముతున్నట్టు చెప్పారు. నేరం రుజువైతే ఆమెను ఉరి తీయాలని డిమాండ్ చేశాడు.

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ (29)ని వివాహం చేసుకున్న సోనమ్, హనీమూన్‌కు తీసుకెళ్లి హత్య చేయించిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో గోవింద్ మాట్లాడుతూ తమ కుటుంబం సోనమ్‌తో అన్ని సంబంధాలు తెంచుకుందని తెలిపారు. రాజా రఘువంశీ కుటుంబానికి న్యాయం జరిగేందుకు తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె స్నేహితుడిగా చెబుతున్న రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురికి షిల్లాంగ్ కోర్టు 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది.

మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం
ఈ దారుణ ఘటన మూడు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మృతుడు రాజా రఘువంశీ తల్లి ఉమ కన్నీరుమున్నీరయ్యారు. "మా కోడలు సోనమ్ ఇంతటి దారుణానికి పాల్పడుతుందని కలలో కూడా ఊహించలేదు. ఆమెకు మరొకరిపై మనసుంటే మా అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుందో అర్థం కావడం లేదు. మా అబ్బాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? మేఘాలయ నుంచి వాడు మృతదేహమై తిరిగి వస్తాడని అనుకోలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుశ్వాహాది కూడా ఇండోర్ నగరమే. అతని తల్లి చున్నీ దేవి మాట్లాడుతూ "మా అబ్బాయి అమాయకుడు. ఎవరో కావాలనే ఇరికించారు. 20 ఏళ్ల అబ్బాయి అంత పెద్ద నేరం ఎలా చేయగలడు?" అని ప్రశ్నించారు. ప్రధాన నిందితురాలు సోనమ్ తల్లి సంగీత మాత్రం మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. "మా అమ్మాయిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే మేఘాలయలో రాజా రఘువంశీకి ఏం జరిగిందో ఇప్పుడే చెప్పలేను" అని ఆమె అన్నారు.

హత్య జరిగినప్పుడు సోనమ్ అక్కడే ఉంది
ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో సోనమ్ మినహా మిగిలిన నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీని హత్య చేసే సమయంలో సోనమ్ ఘటనా స్థలంలోనే ఉందని, హత్యను ప్రత్యక్షంగా చూసిందని నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో ప్రధాన కుట్రదారుగా భావిస్తున్న రాజ్ కుశ్వాహా ఇండోర్‌లోనే ఉన్నాడని, మిగతా ముగ్గురి ప్రయాణ ఖర్చులకు అతడే డబ్బులు సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.

మే 11న రాజా రఘువంశీతో జరిగిన పెళ్లి ఇష్టంలేని సోనమ్ వివాహమైన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లింది. అక్కడ తన ప్రియుడు రాజ్ కుశ్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఇద్దరూ కలిసి రఘువంశీ హత్యకు కుట్ర పన్ని, దానిని అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కామాఖ్య ఆలయంలో పూజ తర్వాతే తాకనిస్తానంటూ నాటకం 
ఈశాన్య భారతంలోని దట్టమైన అడవుల్లో తన భర్తను హతమార్చేందుకు సోనమ్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పథకం పన్నిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగా గువాహటిలోని కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తయ్యాకే తనను తాకనివ్వాలంటూ భర్తకు షరతు విధించి, మాయమాటలతో ఆ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు మేఘాలయ పోలీసులు తెలిపారు. దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతానికి తనను తీసుకెళ్లాలని భర్తను సోనమ్ బలవంతపెట్టింది. అయితే, అక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, వెయిసావ్‌దాంగ్ జలపాతం వద్దకు తీసుకెళ్లి, అక్కడ కిరాయి హంతకుల సాయంతో హత్య చేయించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించి కీలకమైన సీసీటీవీ సాక్ష్యాధారాలను సేకరించినట్టు తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ స్యియెమ్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Sonam
Raja Raghuvanshi
Honeymoon murder case
Raj Kushwaha
Meghalaya
Kamakhya temple
Interstate murder
Crime news
Police investigation
Indore

More Telugu News