Nara Lokesh: లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఎప్పుడు? సీఎం చంద్రబాబు స్పందన ఇదే!

Nara Lokesh to Get Party Leadership Chandrababu Responds
  • పార్టీ నియమావళి, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత అన్న సీఎం
  • టీడీపీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి
  • లోకేశ్ కార్యకర్తల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంస
నారా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారనే అంశంపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేశ్ విషయంలో పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మహానాడులో ఈ అంశంపై చర్చ తీవ్రతరం అయిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"పార్టీకి అంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. టీడీపీలో మేం ఎప్పుడూ యువతరానికి పెద్దపీట వేస్తాం. దేశంలో ఏ ఇతర పార్టీలో లేనంతగా ఎక్కువ మంది యువ ఎంపీలు, యువ ఎమ్మెల్యేలు మా పార్టీలోనే ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో కూడా అతి పిన్న వయస్కుడైన మంత్రి మా పార్టీ నుంచే ఉన్నారు. విద్యార్హతల విషయంలోనూ మా పార్టీనే ముందుంది" అని చంద్రబాబు తెలిపారు. 

పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం లోకేశ్ చురుగ్గా పనిచేస్తున్నారని ప్రశంసిస్తూ.. "కార్యకర్తల సంక్షేమానికి లోకేశ్ ఎంతో చేస్తున్నారు. పార్టీ నియమావళి ప్రకారం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేశ్ విషయంలో నిర్ణయం తీసుకుంటాం" అని ఆయన వివరించారు.

టీడీపీలో లోకేశ్‌కు కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి పెరుగుతున్న తరుణంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మహానాడులో పలువురు సీనియర్ నాయకులు, మంత్రులు కూడా లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని చంద్రబాబును కోరారు. ఇది లోకేశ్ నాయకత్వంపై కేడర్‌కు ఉన్న నమ్మకాన్ని, దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలో తరం మార్పు ఆవశ్యకతను సూచిస్తోంది. 

ప్రస్తుతం లోకేశ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో  క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Nara Lokesh
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Mahanadu
Party Leadership
AP Politics

More Telugu News