Chandrababu Naidu: మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెనుమాకలో పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం

Chandrababu Naidu Keeps Promise Home Dream Realized for Poor Family in Penumaka
  • గతేడాది జులై 1న ఇచ్చిన మాటను ఏడాది తిరగకుండానే నిలబెట్టుకున్న చంద్రబాబు
  • రూ.12 లక్షల వ్యయంతో బాణావత్ పాములు నాయక్ దంపతులకు డాబా ఇల్లు
  • రాష్ట్ర ప్రభుత్వ సాయంతో పాటు మంత్రి లోకేశ్, టీడీపీ నేత కొల్లి శేషు చేయూత
  • నిన్న గృహప్రవేశం చేసిన కుటుంబం.. సీఎంకు కృతజ్ఞతలు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని సుగాలి కాలనీలో నివసించే ఓ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం బాణావత్ పాములు నాయక్, సీతమ్మ నాయక్ దంపతులకు పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి, వారి సొంతింటి కలను సాకారం చేశారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

గత ఏడాది జులై 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెనుమాకలో ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ల’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సుగాలి కాలనీలోని పాములు నాయక్, సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్లి వారికి తొలి పింఛన్లను అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాము పూరి గుడిసెలో నివసిస్తున్నామని, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ దంపతులు ముఖ్యమంత్రి వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వారి దీనస్థితికి చలించిన చంద్రబాబు త్వరలోనే ఒక మంచి ఇల్లు కట్టించి ఇస్తానని ఆ రోజే హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం ఏడాది తిరగకముందే సుమారు రూ. 12 లక్షల వ్యయంతో ఒక డాబా ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.8 లక్షల ఆర్థిక సహాయం అందించింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు తమ సహకారంతో సమకూర్చి, ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా చూశారు.

నూతనంగా నిర్మించిన ఈ ఇంటిని నిన్న ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, కొల్లి శేషు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పంచుమర్తి ప్రసాద్‌లు కలిసి ప్రారంభించారు. అనంతరం పాములు నాయక్ దంపతులు తమ పాత పూరి గుడిసె నుంచి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా పాములు నాయక్ దంపతులు మాట్లాడుతూ "మా కష్టాలను స్వయంగా తెలుసుకుని చంద్రబాబు గారు మాకు ఈ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆయనకు, అలాగే మంత్రి నారా లోకేశ్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం" అని తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Penumaka
Guntur district
NTR Bharosa pension scheme
Housing scheme Andhra Pradesh
Nara Lokesh
Chilapalli Srinivasa Rao
Pamulu Nayak
Seetamma Nayak

More Telugu News