Upasana: ఉపాసన చేతుల మీదుగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ క్యాంపెయిన్ ప్రారంభం

Upasana Launches Breast Cancer Awareness Campaign
  • రొమ్ము క్యాన్సర్‌పై ఫ్యూజీఫిల్మ్, అపోలో హాస్పిటల్స్ కీలక ప్రచారం
  • ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభం
  • ఆరోగ్య పరిరక్షణ ఓ ఉద్యమం కావాలన్న ఉపాసన
హెల్త్ కేర్ టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధి చెందిన ఫ్యూజీఫిల్మ్ ఇండియా, సామాజిక బాధ్యతలో భాగంగా ఓ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే పేరుతో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఈ సీఎస్ఆర్ ప్రచారాన్ని అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్, సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన లాంఛనంగా ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే, అంత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.

ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ, "మహిళలు ఎలాంటి భయాలు లేకుండా, పూర్తి గౌరవంతో, ఆరోగ్యంగా జీవించాలన్నదే నా ఆకాంక్ష. ఈ రోజు మనం ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. ఆధునిక టెక్నాలజీ ఫలాలను సాధారణ మహిళల దైనందిన జీవితాల్లోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆరోగ్య వ్యవస్థను ఒక ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ఇది మొదటి అడుగు" అని తెలిపారు.

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ తీవ్రతను వివరిస్తూ, "మన దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుండగా, ప్రతి 13 నిమిషాలకు ఒకరు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, భారతీయ మహిళల్లో 50 శాతానికి పైగా బాధితుల్లో వ్యాధి చివరి దశలో ఉన్నప్పుడే గుర్తించబడుతోంది. ముఖ్యంగా, సరైన స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో లేని వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా కనిపిస్తోంది," అని ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ 'నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్' ద్వారా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు నేరుగా మహిళల వద్దకే వెళ్తారని ఆమె వివరించారు. ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాలు, పట్టణ శివార్లలోని బస్తీలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వద్దకు వెళ్లి వారికి అవసరమైన సేవలు అందిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో దాదాపు 1.5 లక్షల మంది మహిళలకు ఈ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.

తమిళనాడులోని అరగొండలో చేపట్టిన పైలట్ ప్రోగ్రామ్ విజయవంతమైందని, దాని ద్వారా అనేక మంది మహిళలకు సేవలు అందించడమే కాకుండా, 150 ప్రాణాలను కాపాడగలిగామని ఉపాసన గుర్తుచేశారు. "ఇది మేము చేస్తున్న చారిటీ కాదు, మా బాధ్యత. స్వీయ రొమ్ము పరీక్షల (సెల్ఫ్ ఎగ్జామ్స్) గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం బ్లడ్ షుగర్ వంటి సమస్యల గురించి ఎంత సహజంగా మాట్లాడుకుంటామో, రొమ్ము ఆరోగ్యం గురించి కూడా అంతే స్వేచ్ఛగా చర్చించుకోవాలి, అవగాహన పెంచుకోవాలి" అని ఆమె పిలుపునిచ్చారు.
Upasana
Upasana Kamineni
Ram Charan wife
Breast Cancer Awareness
Fujifilm India
Apollo Hospitals CSR
Early Detection
Women's Health
Cancer Screening India
Healthcare Technology

More Telugu News