Jitendra Raghuwanshi: హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి జితేంద్ర రఘువంశీ పేరు

Jitendra Raghuwanshi Name Surfaces in Honeymoon Murder Case
  • జితేంద్ర యూపీఐ ఖాతా ద్వారానే హంతకులకు సోనమ్ చెల్లింపులు
  • హవాలా కోణంలోనూ పోలీసుల దర్యాప్తు ముమ్మరం
  • జితేంద్ర తమ బంధువని, వ్యాపార ఖర్చుల ఖాతా అని సోనమ్ సోదరుడి వెల్లడి
దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'హనీమూన్ హత్య' కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ.. తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించేందుకు జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తికి చెందిన యూపీఐ ఖాతాను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ కొత్త పేరు తెరపైకి రావడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. దీంతో జితేంద్ర రఘువంశీ ఎవరు? ఈ హత్యతో అతడికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారికి మే 23వ తేదీన జితేంద్ర రఘువంశీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి సోనమ్ డబ్బులు పంపినట్టు ఆధారాలు సేకరించారు. ఈ చెల్లింపులు హవాలా మార్గంలో జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సోనమ్ కుటుంబ వ్యాపారాలకు హవాలాతో ఏమైనా లావాదేవీలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

అయితే, జితేంద్ర రఘువంశీ గురించి, అతడి బ్యాంకు ఖాతా వినియోగం గురించి సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. హవాలా ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. "జితేంద్ర మాకు బంధువు. మా కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా గోదాములో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు చూసుకుంటాడు. ఆయన పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బు కూడా మాదే. వ్యాపారంలో రోజువారీ ఖర్చుల కోసం ఆ ఖాతా నుంచి చెల్లింపులు చేస్తుంటాం. సోనమ్ వాడిన యూపీఐ ఖాతాను కూడా జితేంద్ర పేరుతోనే తెరిచాం" అని గోవింద్ వివరించారు. అయితే, సోనమ్ కోసం ప్రత్యేకంగా జితేంద్ర పేరుతో యూపీఐ ఖాతా ఎందుకు తెరిచారనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
Jitendra Raghuwanshi
Sonam Raghuwanshi
Raja Raghuwanshi
honeymoon murder case
crime news
UPI account
supari killing
Havala
Govind
police investigation

More Telugu News