Shrasti Raghuwanshi: సోదరుడి హత్యపై ఇన్ స్టా రీల్స్ పై విమర్శలు.. శ్రస్తి రఘువంశీ ఏమన్నారంటే?

Shrasti Raghuwanshi Responds to Criticism Over Brothers Murder Reels
  • ఫాలోవర్లను పెంచుకోవడం కోసం కాదు నా సోదరుడికి న్యాయం కోసమే..
  • నేను మౌనంగా ఉండి ఉంటే రాజా హంతకులు దొరికేవారు కాదన్న శ్రస్తి
  • హనీమూన్ మర్డర్ కేసుపై శ్రస్తి వీడియోలతో కీలక వివరాలు వెలుగులోకి..
  • ఇన్ స్టాలో శ్రస్తి రఘువంశీకి 4 లక్షలకు పైగా ఫాలోవర్లు
తన సోదరుడు రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన వదిన సోనమ్‌ను విమర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేసినందుకు రాజా సోదరి శ్రస్తి రఘువంశీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మేఘాలయలోని ఓ లోయలో రాజా మృతదేహం లభ్యమైనప్పటి నుండి, శ్రస్తి తన సోదరుడి మరణంపై అవగాహన కల్పిస్తూ, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. అయితే, కుటుంబ విషాదాన్ని ఆన్‌లైన్‌లో ప్రచారం పొందేందుకు వాడుకుంటున్నారని కొందరు నెటిజన్లు ఆమెపై ఆరోపణలు గుప్పించారు. ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇంతగా దిగజారాలా అంటూ మండిపడుతున్నారు.

ఈ విమర్శలపై శ్రస్తి తాజాగా స్పందించారు. తాను మౌనంగా ఉండి ఉంటే, తన సోదరుడి హత్య కేసు రెండు మూడు రోజుల్లోనే మూతపడి ఉండేదని, హంతకుల జాడ కూడా దొరికేది కాదని ఆమె అన్నారు. "నా తమ్ముడి మరణాన్ని అడ్డుపెట్టుకుని ఫాలోవర్లను, వ్యూస్‌ను పెంచుకుంటున్నానని ఎవరైతే అంటున్నారో, అది నిజం కాదు. నేను పోస్టులు పెట్టి, అవి వైరల్ కాకపోయుంటే, బహుశా హంతకులు ఇంకా దొరికేవారు కాదేమో. మేం మౌనంగా ఉంటే ఈ కేసు రెండు మూడు రోజుల్లోనే మూసివేయబడేది. ఇలాంటి ఎన్నో కేసులు చూశాం - హంతకులు దొరికేవారు కాదు" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

హత్యకు గురైన తన సోదరుడి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని శ్రస్తి స్పష్టం చేశారు. "ఎవరితో పోరాడాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా, నా గొంతు అందరికీ చేరేలా చూస్తాను. దీనికి భిన్నంగా ఎవరు ఏమన్నా అది తప్పే. నన్ను అన్నిచోట్లా ట్రోల్ చేస్తున్నారని నాకు తెలుస్తోంది. కానీ మీరు నా సోదరుడి కోసం ఏం చేస్తున్నారు? నన్ను నిందిస్తున్నారు అంతే. కానీ ఓ సోదరి తన సోదరుడి కోసం ఎలా గొంతెత్తుతుందో మీరు ఆలోచించాలి. నాకు మద్దతు ఇవ్వాలి, సహాయం చేయాలి. కానీ మీరు నన్నే నిందిస్తున్నారు. ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 4,81,000 మంది ఫాలోవర్లు ఉన్న శ్రస్తి, తన సోదరుడు రాజా, సోనమ్‌ల వివాహ చిత్రాన్ని, ఓ వీడియోను నేపథ్యంగా ఉంచి సోనమ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఓ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వ్యతిరేకత మొదలైంది. "నా సోదరుడు సోనమ్ రఘువంశీతో ఏడు జన్మల పాటు ఉంటానని ప్రమాణం చేశాడు, కానీ ఆమె ఏడు రోజులు కూడా అతనితో ఉండలేకపోయింది. ఇంత దారుణంగా చంపేంత తప్పు మా అన్న ఏంచేశాడు? నీకు వేరొకరు నచ్చితే అతడితో పారిపోవచ్చు కదా. మా అన్నను ఎందుకు చంపావు? ఒకరి సోదరుడిని, ఒకరి కుమారుడిని ఎందుకు దూరం చేశావు?" అంటూ శ్రస్తి కన్నీటిపర్యంతమయ్యారు.
Shrasti Raghuwanshi
Raja Raghuwanshi
Sonam Raghuwanshi
murder case
Instagram reels
social media criticism
justice for Raja
Meghalaya
family tragedy
online trolling

More Telugu News