Kavitha: ఫాంహౌస్ కు వెళ్లినా పట్టించుకోలేదు.. కవితపై కేసీఆర్ ఆగ్రహం

Kavitha Ignored at Farmhouse KCR Angered
  • తండ్రి కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ యత్నం
  • భర్తతో కలిసి ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత
  • కాళేశ్వరం విచారణకు వెళ్తూ కుమార్తెను పట్టించుకోని కేసీఆర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆమె తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అయితే, ఈ భేటీ ఆశించినట్లుగా జరగలేదని సమాచారం.

వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి నిన్న ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కవిత అక్కడికి చేరుకున్నప్పటికీ కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదని పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఇదే సమయంలో, అక్కడే ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చిన్న ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న పార్టీ నాయకులంతా హడావుడిగా ఆయన వద్దకు పరుగులు తీశారు. గాయపడిన పల్లాను హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామాల మధ్యే కేసీఆర్ గదిలో నుంచి బయటకు వచ్చి, కూతురు కవితను పలకరించకుండా నేరుగా వాహనంలో ఎక్కి బీఆర్‌కే భవన్‌కు బయలుదేరి వెళ్లారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీలో కవిత భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో తండ్రి నుంచి ఇలాంటి స్పందన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Kavitha
Kalvakuntla Kavitha
KCR
BRS
BRS Party
Telangana Politics
Erravalli
Palla Rajeshwar Reddy
Kaleshwaram Project

More Telugu News