Lucknow Constable Assault: మీ ఆయన వేధిస్తున్నాడని చెప్పిన బాలికపై భర్తతో కలిసి దాడిచేసిన మహిళ

Lucknow Constable Couple Assault Girl After Harassment Complaint
  • లక్నోలో బాలికపై కానిస్టేబుల్ దంపతుల దాడి
  • బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో తీవ్ర గాయాలపాలైన బాలిక
  • బాలిక కాలుకు ఫ్రాక్చర్, వెన్నెముకకు గాయాలు
  • కానిస్టేబుల్ దంపతులు, వారి బంధువుపై కేసు నమోదు
‘మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేయడమే ఆ బాలిక చేసిన నేరమైంది. బాలిక చెప్పింది విన్న తర్వాత తొలుత భర్తతో గొడవ పడిన సదరు మహిళ, ఆపై భర్తతో కలిసి బాలికపైనే దాడి చేసింది. ఇద్దరూ కలిసి రెండు అంతస్తుల భవనం పైనుంచి బాలికను కిందకు తోసేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలిక ఆసుపత్రిలో చేరింది. బాలికపై దాడి చేసిన దంపతులు ఇద్దరూ కానిస్టేబుళ్లే కావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుందీ దారుణం.

వివరాల్లోకి వెళితే.. లక్నోలోని లాల్‌పూర్ ప్రాంతంలో బాధితురాలు (16) తన కుటుంబంతో నివసిస్తోంది. వారి ఎదురింట్లో ఓ కానిస్టేబుల్, అతని భార్య (మహిళా కానిస్టేబుల్) ఉంటున్నారు. రెండు కుటుంబాలకూ ఒకే టాయిలెట్‌ ఉంది. ఈ క్రమంలో తాను ఒంటరిగా ఉన్నప్పుడు సదరు కానిస్టేబుల్ లైంగికంగా వేధించేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు ఆరోపించింది.

"ఆ కానిస్టేబుల్ చాలా కాలంగా నన్ను చెడు దృష్టితో చూస్తున్నాడు. చాలాసార్లు నా దారికి అడ్డొచ్చి, చేయి పట్టుకుని అసభ్యంగా మాట్లాడాడు" అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఈ వేధింపులు భరించలేక కానిస్టేబుల్ భార్యకు విషయం చెప్పింది. తొలుత తన భర్తతో గొడవపడిన భార్య, కొంత సమయం తర్వాత బయటకు వచ్చి, రెండంతస్తుల భవనం పైనున్న కామన్ ఏరియాలో కూర్చున్న బాలికను ఆధారం చూపించమని డిమాండ్ చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి తనపై దాడి చేసి, భవనం పైనుంచి కిందకు తోసేశారని బాధితురాలు వాపోయింది.

బాలిక కిందపడి ఉండటం చూసిన ఆమె కుటుంబ సభ్యులు, తండ్రి పైకి వెళ్లి నిలదీయగా, కానిస్టేబుల్ దంపతులతో పాటు అక్కడకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ సోదరుడు కూడా కలిసి అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలిక, ఆమె తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మంగళవారం బీబీడీ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ దంపతులు, మహిళా కానిస్టేబుల్ సోదరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Lucknow Constable Assault
Uttar Pradesh Police
Police Harassment Case
Sexual Harassment Complaint
Crime News India
Lucknow Crime
Assault Case
Harassment Case India
BBD Police Station
Crime Against Women

More Telugu News