Etela Rajender: ఈ ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది: ఈటల రాజేందర్

Etela Rajender Praises Modi Governments Achievements
  • మోదీ పాలనలో దేశం గర్వించేలా అభివృద్ది జరిగిందన్న ఈటల
  • ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చామని వ్యాఖ్య
  • కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపాటు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా సాగిస్తున్న సుపరిపాలన ప్రతి భారత పౌరుడు గర్వపడేలా ఉందని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ... 2014కు ముందు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు.

"సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా నిలబెట్టి, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమతో ప్రపంచ దేశాలతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు మెరుగయ్యాయి" అని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత మహిళల బొట్టు తుడిచి, భర్తలను వారి కళ్ల ముందే చంపిన దుశ్చర్యకు మోదీ ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టిగా ప్రతీకారం తీర్చుకుందని ఆయన గుర్తుచేశారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఈటల వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సహకరించడం లేదని అబద్ధపు ప్రచారం చేయడం దారుణమని ఆయన విమర్శించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విజయరామారావు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ముందుంటుందని, అయితే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రచారంలో కొంత వెనుకబడి ఉందని అభిప్రాయపడ్డారు. "గత కాంగ్రెస్ హయాంలో మంత్రులు కుంభకోణాలు, దోపిడీలకు పాల్పడి ఇప్పటికీ జైలు జీవితం గడుపుతున్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందిస్తోంది" అని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు దేశంలో నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉండేవని, మహిళా రిజర్వేషన్లు, మహిళా బిల్లు ద్వారా ప్రధాని మోదీ దేశాభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేశారని కొనియాడారు. దేశంలోని మారుమూల గ్రామాలకు సైతం మరుగుదొడ్లు నిర్మించిన ఘనత మోదీకే చెందుతుందని విజయరామారావు పేర్కొన్నారు.

Etela Rajender
Narendra Modi
BJP
Indian Economy
Telangana
Central Government Funds
Operation Sindoor
Vijayarama Rao
India development
ஷம்மிர் பேட்

More Telugu News