Nara Lokesh: ఏడాదిలో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం ప్రారంభ‌మైంది: మంత్రి లోకేశ్‌

Nara Lokesh says Andhra Pradesh Transitions From Destruction To Development In A Year
  • మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంద‌న్న మంత్రి 
  • గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చామ‌ని వ్యాఖ్య‌
  • దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నామ‌న్న మంత్రి
  • బాబు సూపర్ సిక్స్ లో ‘తల్లికి వందనం’ హామీ నిలబెట్టుకున్నామ‌ని వెల్ల‌డి
  • సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అన్న లోకేశ్‌
  • ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత త‌మ‌పై ఉంద‌ని వ్యాఖ్య‌
  • కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మంత్రి నారా లోకేశ్ విలేకరుల సమావేశం
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తిచేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. 

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. 

గడచిన పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో తీసుకువచ్చాం
గడచిన పదేళ్లలో రానిపెట్టుబడులు ఈ ఏడాది కాలంలో తీసుకురావడం జరిగింది. రూ. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్ మెంట్స్ లో ఏపీ భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. 16శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇందులో భాగంగా టీసీఎస్, ఎల్జీ, ఎన్టీపీసీ గ్రీన్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్, రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈ రోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగాం. రైల్వేజోన్ సాధించాం. అలాగే భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. 

దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధులకు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు అందిస్తున్నాం. వికలాంగులకు రూ.3వేలు పెంచి రూ.6వేలు ఇస్తున్నాం. మంచానికే పరిమితమైన వారికి ప్రతినెలా రూ.15వేలు అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం కూడా అమలుచేస్తున్నాం. దీపం పథకం ద్వారా ఇప్పటికే 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడపడుచులకు అందించడం జరిగింది. గ్యాస్ పథకంలో సవరణలు తీసుకువచ్చి సదరు నగదును మహిళల బ్యాంక్ అకౌంట్లకే నేరుగా బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

బాబు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నాం
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం హామీ నిలబెట్టుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలుచేస్తామని చెప్పాం. హామీ ఇచ్చిన విధంగా జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నగదు తల్లుల అకౌంట్లలో జమచేయడం జరుగుతుంది. రూ.13వేలు తల్లుల అకౌంట్లలో పడతాయి. రూ.2వేలు పాఠశాలల్లో మెయింటెన్స్ గ్రాంట్ కింద ఖర్చు చేయడం జరుగుతుంది. తల్లికి వందనం కింద దాదాపు 60శాతం కుటుంబాలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నారు. వారికి ఇద్దరుంటే రూ.26వేలు, ముగ్గురుంటే రూ.39వేలు వస్తాయి. వారి అకౌంట్లలోనే నగదు జమచేయడం జరుగుతుంది. బాబు సూపర్ సిక్స్ లో మరొక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడం జరిగింది.

సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మాండేట్ ఇచ్చారు. ఓ వైపు ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ.. ప్రజలు ఏ ఆశతో కూటమికి 94శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉంది" అని మంత్రి లోకేశ్ అన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
AP Government
Chandrababu Naidu
TDP
Mega DSC
AP Investments
Pension Scheme
Thalli ki Vandanam
AP Politics

More Telugu News