Talliki Vandanam: 'తల్లికి వందనం' పథకానికి ఉండాల్సిన అర్హతలు, అవసరమైన పత్రాలు ఇవే!

Talliki Vandanam Scheme Eligibility and Required Documents
  • ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం
  • సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకున్నా అందరికీ వర్తింపు!
‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈరోజు లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నిధుల మంజూరుతో పాటు మార్గదర్శకాలను వివరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో నెంబర్ 27ను జారీ చేశారు.

‘తల్లికి వందనం’ పథకానికి అర్హతలు ఇవే:

* దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసి అయి ఉండాలి.
* వారి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉండాలి. గ్రామాల్లో నెలకు రూ.10,000... పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12,000 మించకూడదు.
* ఇప్పటివరకు ప్రభుత్వ డేటాబేస్‌లలో నమోదు కాని తల్లులు, పిల్లలు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
* తల్లులు తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తిచేసి ఉండాలి.
* బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు, ఎన్‌పీసీఐ (NPCI) తో అనుసంధానం చేసి ఉండాలి.
* ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
* కుటుంబానికి మూడు ఎకరాల లోపు మాగాణి భూమి లేదా పది ఎకరాల లోపు మెట్ట భూమి, లేదా రెండూ కలిపి పది ఎకరాల లోపు భూమి ఉండాలి.
* విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:

1. తల్లి మరియు పిల్లల ఆధార్ కార్డులు
2. నివాస ధృవీకరణ పత్రం (రేషన్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు)
3. ఆదాయ ధృవీకరణ పత్రం
4. పిల్లల జనన ధృవీకరణ పత్రం
5. తల్లి బ్యాంకు ఖాతా వివరాలు (పాస్‌బుక్ మొదటి పేజీ లేదా రద్దు చేసిన చెక్కు)
6. విద్యార్థికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్

దరఖాస్తు విధానం:

తల్లికి వందనం పథకానికి ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన తల్లులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించి, అక్కడ అందుబాటులో ఉంచిన దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిచేసి, అవసరమైన పత్రాలను జతచేసి సమర్పించాలి. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం, అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. అర్హత పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సహాయం జమ చేయబడుతుంది.
Talliki Vandanam
AP government schemes
Andhra Pradesh
education scheme
Kona Shashidhar
Jagananna Vidya Deevena
school education
financial assistance
student attendance
government welfare

More Telugu News