VVR Krishnam Raju: అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు... కృష్ణంరాజుకు రిమాండ్

VVR Krishnam Raju Remanded Over Amaravati Women Comments
  • కృష్ణంరాజుకు జూన్ 26 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
  • సాక్షి టీవీ లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు
  • ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు
రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

సాక్షి టీవీ ఛానల్‌లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో వీవీఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి.

ఈ క్రమంలో, అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. కాగా, ఇదే కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే. తాజా పరిణామంతో ఈ కేసులో ఇద్దరు పాత్రికేయులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయింది. ఈ ఘటన మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
VVR Krishnam Raju
Amaravati
Andhra Pradesh
Sakshi TV
Kommineni Srinivasa Rao
Defamatory comments
Judicial Remand
Kambampati Sirisha
Tulluru Police
Amaravati JAC

More Telugu News