Chandrababu Naidu: సుపరిపాలనలో మొదటి అడుగు... నేటి నుంచి కీలక హామీ అమలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches Talli ki Vandanam Scheme in Andhra Pradesh
  • 67.27 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలు
  • ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వం కన్నా 24.65 లక్షల మంది విద్యార్థులకు అదనంగా లబ్ధి
  • పథకం కోసం రూ.10,091 కోట్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.1,346 కోట్లు కేటాయింపు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేటి నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి గురువారంతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హామీని నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒక కీలకమైన పథకమని పేర్కొన్నారు.

67 లక్షల మంది పిల్లలకు లబ్ధి 

‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇందుకోసం మొత్తం రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నిధుల్లో రూ.1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని అమ్మఒడి పథకంతో పోల్చినప్పుడు, తమ ప్రభుత్వం అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

“గత ప్రభుత్వం కేవలం 42,61,965 మంది విద్యార్థులకే అమ్మఒడి పథకం అందించింది. మా ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. అంటే, గత ప్రభుత్వం కంటే 24,65,199 మంది విద్యార్థులకు అదనంగా సాయం అందిస్తున్నాం. వారు రూ.5,540 కోట్లు ఇస్తే, మేం రూ.8,745 కోట్లను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వారికంటే రూ.3,205 కోట్లు అదనంగా కేటాయిస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.

1వ తరగతి నుంచి ఇంటర్ వరకు..!

ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకున్నామని, పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వారికి కూడా నిధులు జమచేస్తామని హామీ ఇచ్చారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో, అనాథ పిల్లల విషయంలో జిల్లా కలెక్టర్ నిర్దేశించిన వారికి నగదు జమ చేస్తామని తెలిపారు. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 76 వేల మంది విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. పారదర్శకత కోసం లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని, సాంకేతిక కారణాలతో ఎవరికైనా సమస్య తలెత్తితే ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 30న తుది జాబితా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో బలహీన వర్గాలకే పెద్దపీట వేశామని, జనాభా సమతుల్యతలో ఇది ఒక ముందడుగు అని సీఎం అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని, సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, దాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని బాగుచేస్తామని, కష్టాలు వచ్చినప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇతర సంక్షేమ పథకాల అమలుపైనా ఆయన ప్రస్తావించారు.
Chandrababu Naidu
Talli ki Vandanam
Andhra Pradesh
Education Scheme
AP Government
Financial Assistance
Student Welfare
Super Six Promises
School Development
Jagan Mohan Reddy

More Telugu News