Chandrababu Naidu: బాధ్యత లేకుండా వేలమందిని వెంటేసుకుని వెళ్లి పొదిలిలో హంగామా చేశారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Stern Action Against Disruptors in Andhra Pradesh
  • కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
  • వైసీపీ కుట్రలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చూస్తోందని ఆరోపణ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం
  • అమరావతిపై వ్యాఖ్యలు, పొదిలి ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం
  • ఇప్పటివరకు తన మంచితనమే చూశారని, ఇకపై ఉపేక్షించబోనని తీవ్ర హెచ్చరిక
  • పొగాకు రైతులకు క్వింటాకు రూ.12 వేలు ఇస్తున్నామని వెల్లడి
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నాడు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా భద్రత, శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.  "ఇప్పటివరకూ నా మంచితనం మాత్రమే చూశారు. ఇకపై ఉపేక్షించేది లేదు" అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 

"సమస్యలను అధిగమించడానికి మేము ప్రయత్నిస్తుంటే, రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతిభద్రతల సమస్యలు సృష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు" అని చంద్రబాబు అన్నారు. నేరాలు, ఘోరాలు చేసే వారికి కొందరు అండగా నిలుస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఎందుకు మద్దతివ్వాలని ఆయన ప్రశ్నించారు.

అమరావతిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "దేవతల రాజధాని అమరావతిని వేశ్యల నగరమా? ఎంత అహంకారం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు?" అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పొదిలిలో గొడవలు సృష్టించారని, అక్కడ మహిళలపై రాళ్లదాడి చేశారని ఆరోపించారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడంపైనా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "బాధ్యత లేకుండా వేల మందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారు. గూండాలను తీసుకెళ్లి మహిళలపై దాడి చేసి రౌడీయిజం చేస్తారా? ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదా?" అని జగన్ ను నిలదీశారు.

పొగాకు రైతులకు తమ ప్రభుత్వం క్వింటాకు రూ.12 వేల ధర కల్పిస్తోందని చంద్రబాబు తెలిపారు. అయితే, బాధ్యత లేకుండా వేలాది మందిని వెంటేసుకుని పొదిలి వెళ్లి హంగామా చేశారని విమర్శించారు.

"శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. రౌడీయిజం చేసి పెత్తనం చెలాయించాలనుకుంటే అలాంటి ఆటలు సాగనివ్వను" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Politics
TDP
YSRCP
Amaravati
Law and Order
Podili
Ganja
YS Jagan

More Telugu News