Mohammad Yunus: యూకే పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్‌కు చేదు అనుభవం

Mohammad Yunus Faces Setback in UK Visit Meeting Denials
  • యూకే పర్యటనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్‌కు నిరాశ
  • బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో భేటీ అయ్యేందుకు యూనస్ చేసిన ప్రయత్నాలు విఫలం
  • బ్రిటన్ రాజు మూడో చార్లెస్‌తోనూ కుదరని సమావేశం
  • బంగ్లాదేశ్ నుంచి తరలించిన నిధులను వెనక్కి తెప్పించడంలో సాయం చేయాలని యూకేకు విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ప్రస్తుతం యూకేలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో సమావేశం కావాలన్న ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు.

జూన్ 13వ తేదీ వరకు మహమ్మద్ యూనస్ యూకేలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో సమావేశమయ్యేందుకు ఆయన ప్రయత్నించారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వానికి ఒక అధికారిక లేఖ కూడా రాశారు. అయినప్పటికీ బంగ్లాదేశ్ అధినేతతో సమావేశానికి స్టార్మర్ సానుకూలంగా స్పందించలేదని సమాచారం. అదే సమయంలో బ్రిటన్ రాజు ఛార్లెస్-3తో సమావేశం కోసం యూనస్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

ఈ పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో యూనస్ మాట్లాడుతూ "బంగ్లాదేశ్‌లో గత పాలకులు దోచుకున్న సొమ్మును విదేశాలకు తరలించారు. అందులో ఎక్కువ భాగం యూకేకే చేరింది. ఈ సొమ్మును కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వం తిరిగి రాబట్టడంలో యూకే సహకరించడం వారి నైతిక బాధ్యత" అని అన్నారు. స్టార్మర్‌తో ప్రత్యక్షంగా చర్చలు జరగనప్పటికీ తమ ప్రయత్నాలకు ఆయన కచ్చితంగా మద్దతు ఇస్తారనే నమ్మకం ఉందని యూనస్ పేర్కొన్నారు.

ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం గానీ ఆసక్తి గానీ తనకు లేదని మహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు.
Mohammad Yunus
Bangladesh
UK visit
Keir Starmer
King Charles III
Bangladesh election

More Telugu News