Air India: ఆ నెంబరు ప్రయాణికుల కోసం... మీడియా వాళ్లు కాల్ చేయొద్దు: ఎయిరిండియా విజ్ఞప్తి

Air India Plane Accident Helpline for Passengers Only
  • అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం
  • కుప్పకూలిన ఎయిరిండియా విమానం
  • లండన్ వెళుతుండగా విషాదం
  • విమానంలో 242 మంది
  • అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎయిరిండియా
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. దీనిపై విమానయాన సంస్థ ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏఐ171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ధృవీకరించింది. 

బోయింగ్ 787-8 రకానికి చెందిన ఈ విమానం అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు బయలుదేరింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడా జాతీయుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

ప్రమాదంలో గాయపడిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. ప్రయాణికుల బంధువులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 1800 5691 444 నంబరుతో ప్రత్యేక హాట్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఫోన్ నెంబరు కేవలం ప్రయాణికుల కుటుంబాల కోసం ఏర్పాటు చేశామని, ఈ నెంబరుకు మీడియా ప్రతినిధులు కాల్ చేయొద్దని తన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

కాగా, ఈ ఘటనపై సంబంధిత అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించిందని, దర్యాప్తునకు తమ పూర్తి సహకారం అందిస్తామని ఎయిరిండియా స్పష్టం చేసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలను ఎప్పటికప్పుడు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా, అలాగే ఎయిరిండియా.కామ్ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని సంస్థ తెలియజేసింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉంటామని ఎయిరిండియా భరోసా ఇచ్చింది.

అంతేకాదు, ఎయిరిండియా సీఈవో, ఎండీ కాంప్ బెల్ విల్సన్ ఓ వీడియో ద్వారా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Air India
Air India flight AI171
Ahmedabad London flight
Flight accident
Campbell Wilson
Boeing 787-8
Flight emergency
Air India helpline
Flight passengers

More Telugu News