Bhumi Chauhan: అదృష్టవంతురాలు... 10 నిమిషాల ఆలస్యం ఆమె ప్రాణాలు కాపాడింది!

Bhumi Chauhan Missed Flight Saved From Air India Crash
  • లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మిస్సయిన భూమి చౌహాన్
  • ట్రాఫిక్ కారణంగా 10 నిమిషాలు ఆలస్యంగా ఎయిర్‌పోర్ట్‌కు
  • టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం
  • ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మహిళ
  • "దేవుడే నన్ను రక్షించాడు" అంటూ భూమి చౌహాన్ స్పందన
కేవలం పది నిమిషాల ఆలస్యం ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. లండన్ వెళ్లాల్సిన విమానాన్ని తృటిలో మిస్సయిన ఆమె, ఘోర విమాన ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, భూమి చౌహాన్ అనే మహిళ గురువారం ఎయిర్ ఇండియా AI-171 విమానంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఆమె ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది.

"కేవలం 10 నిమిషాల తేడాతో నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఈ ప్రమాదం గురించి విన్నప్పటి నుంచి నా శరీరం ఇంకా వణుకుతూనే ఉంది" అని భూమి చౌహాన్ తీవ్ర ఆందోళనతో తెలిపారు. "ప్రాణనష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఏం జరిగిందో విన్న తర్వాత నా మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. నేను మాట్లాడలేకపోతున్నాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విమానం మిస్సయిన తర్వాత తాను మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరినట్లు చౌహాన్ చెప్పారు. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానాశ్రయానికి సమీపంలోని ఓ నివాస ప్రాంతంలో కుప్పకూలింది.

"దేవుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా గణపతి బప్పా నన్ను కాపాడాడు" అని ఆమె ఉద్వేగంగా అన్నారు. భూమి చౌహాన్ రెండు సంవత్సరాల తర్వాత సెలవుల్లో భారతదేశానికి వచ్చారు. ఆమె తన భర్తతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానంలో ఆమె ఒంటరిగా లండన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. "ఆ పది నిమిషాల వల్లే నేను ఫ్లైట్ ఎక్కలేకపోయాను. దీన్ని ఎలా వివరించాలో నాకు తెలియడం లేదు" అని ఆమె తెలిపారు.

గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదం, అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీకి కు చెందిన అత్యంత ఆధునిక వైడ్‌బాడీ విమానం 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ప్రమాదానికి గురైన విమానం తయారైంది కేవలం 12 సంవత్సరాల క్రితమే. ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, విమానం టేకాఫ్ అయిన తర్వాత 625 అడుగుల ఎత్తుకు చేరుకుని, ఆ వెంటనే వేగంగా కిందకు దిగి నివాస ప్రాంతంలో కూలిపోయి భారీ అగ్నిగోళంగా మారింది.
Bhumi Chauhan
Air India AI-171
London flight
Ahmedabad accident
flight crash
missed flight
lucky escape
Sardar Vallabhbhai Patel International Airport
Boeing 787 Dreamliner
flight radar 24

More Telugu News