Air India: విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ

Air India Plane Crash British Investigators Arriving in India
  • అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం
  • లండన్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి ప్రమాదం
  • విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది
  • వారిలో ఒకరు మాత్రమే బయటపడిన వైనం
అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం.

ఈ భారీ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు భారత్ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్’ (ఏఏఐబీ) బృందం భారత్‌కు రానుంది. పౌర విమాన ప్రమాదాలు, తీవ్రమైన సంఘటనలపై దర్యాప్తు చేయడంలో ఏఏఐబీకి ప్రత్యేక నైపుణ్యం ఉంది. భారతదేశ నేతృత్వంలో జరిగే ఈ దర్యాప్తునకు తమ బృందం సహాయ సహకారాలు అందిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో తమ దేశ పౌరులు కూడా ఉన్నందున, భారత దర్యాప్తులో తమకు 'నిపుణుల హోదా' ఉంటుందని బ్రిటన్ పేర్కొంది. 

ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారందరూ మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే అధికారికంగా ధృవీకరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్ జాతీయులు, ఒక కెనడా పౌరుడు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Air India
Boeing 787
Plane crash
Ahmedabad
AAIB
UK investigation
Amit Shah
Flight accident
Aviation accident
Air accident investigation branch

More Telugu News