Nagababu: అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్.. చిరు, సుస్మిత విమాన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ఘ‌ట‌న‌ను గుర్తుచేసుకున్న నాగ‌బాబు

Nagababu recalls Chiranjeevi Susmita plane accident after Ahmedabad flight crash
  • దేశ‌వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిరిండియా విమాన ప్ర‌మాదం
  • విమానంలోని 242 మందిలో 241 మంది మృతి
  • ఈ విషాద ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా స్పందించిన ఎమ్మెల్సీ నాగ‌బాబు
  • ఈ దుర్ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్న మెగా బ్ర‌ద‌ర్‌
అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్‌విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171 (బోయింగ్ 787-8) నిన్న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన దుర్ఘ‌ట‌న‌లో 241 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ విషాద ఘ‌ట‌న‌పై ఎమ్మెల్సీ, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. అహ్మ‌దాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసిందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా చాలా ఏళ్ల క్రితం సోద‌రుడు చిరంజీవి, ఆయ‌న కూతురు సుస్మిత ఓ విమాన ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డ విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. 

"అహ్మ‌దాబాద్ ఫ్లైట్ క్రాష్ నా మనస్సుని కలచి వేసింది. చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది ఫిల్మీ పర్సనాలిటీస్ ఉన్న చెన్నై ఫ్లైట్ తిరుపతిలో ఎక్కడో ల్యాండ్ అయ్యింది. అందులో మా అందరికీ అత్యంత ప్రియమైన మా అన్నయ్య చిరంజీవి, మా స్వీటీ(సుష్మిత) పాపా ఉన్నారు. ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయ్యిందంట, మా అన్నయ్య మా స్వీటీ పాపా ఎలా ఉన్నారో సేఫ్ గా వున్నారో లేదో అన్న ఆందోళన నా మనస్సు కలచివేసింది. అన్నయ్య, స్వీటీ పాపా సేఫ్, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు సేఫ్ అని తెలిసాక మనసు కుదుట పడింది. ఆ ఫ్లైట్ ప్ర‌మాదం ఎఫెక్ట్ ఈ రోజుకి నా మనసు లోంచి పోలేదు. 

అలాంటిది ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ గురించి విజువల్స్ చూస్తుంటే నా గుండె తరుక్కు పోతుంది. ఎంతమంది యువకులు వాళ్ల భ‌విష్య‌త్తు కోసం ఎన్నెన్ని ఆశలతో ఆ ఫ్లాట్ ఎక్కారో ఎంతమంది పెద్ద వాళ్ళు వాళ్ల జీవిత చరమాంకంలో రిటైర్మెంట్ జీవితాన్ని అద్భుతంగా ఊహించుకొంటూ ఆ ఫ్లైట్ ఎక్కారో ఏ తల్లి తన బిడ్డల దగ్గరకి చేరాలని ఆత్రంతో ఫ్లైట్ ఎక్కారో ముక్కుపచ్చలారని పసిపాపలు ఈ లోకం ఒకటుందని తెలియక కేవలం తల్లి పొత్తిళ్లలో సేఫ్ గా ఉన్నామనుకొన్న పసి బిడ్డలు ..ప్రయాణీకులని సేఫ్ డెస్టినేషన్ కి చేర్పించి తన ఆత్మీయులతో గడపాలని ఊహల్లో ఉన్న పైలట్, కో పైలట్ ఇతర క్రూ మెంబర్స్.

అసలు ఈ ఫ్లైట్ తో సంబంధం లేని మెడికో స్టూడెంట్స్ హాస్టల్ లో లంచ్ చేస్తుంటే పిడిగుపాటులా వాళ్ల‌ నెత్తిన పడి ప్రాణాలు తీసిన ఫ్లైట్. ఏ మెడికో బిడ్డ ఎన్ని ఆశలతో డాక్టర్స్ అవుదామని చదువు కుంటున్నారో వాళ్ల జీవితాలు వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని ఆసలు పెట్టుకున్నారో... ఏమనాలో ఏమి ఆలోచించాలో కూడా తెలియని నిస్తేజ స్థితి. ఇన్ని నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఒక ఫ్రాక్షన్ సెకండ్ లో ఇదంతా ఒక పీడకల అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. గొంతును ఎవరో నొక్కుతున్నట్లు తలని ఒక రాకాసి హస్తంతో పిసుకుతున్మట్లుగా ఒక రకమైన స్థితిలో నిస్తేజంతో ఉండిపోయాను.

ఏడుపు రావటం లేదు, గొంతు పూడుకు పోతుంది. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాలవాళ్లు ఆ ఫ్లైట్  లో ఉండే వుంటారు. ఈ దేవుళ్ళు ఏమైపోయారు, ఎందుకు కాపాడలేకపోయారు అనిపిస్తుంది. ఈ శతాబ్దానికి ఇంతకన్నా పెద్ద ఆపద రాదు రాకూడదు కూడా. చనిపోయిన వాళ్ళకి కన్నీళ్ళతో బాధాతప్తా హృదయంతో, వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా" అని నాగ‌బాబు ట్వీట్ చేశారు. 
Nagababu
Ahmedabad flight crash
Chiranjeevi
Susmita
Air India AI171
flight accident
plane crash
Tollywood
Air India flight
Boeing 787-8

More Telugu News