VVR Krishnam Raju: పోలీసులు ఎక్సలెంట్‌గా జాబ్ చేశారన్న కృష్ణంరాజు.. మీ సర్టిఫికెట్ అడగలేదన్న న్యాయాధికారి

VVR Krishnam Raju Comments on Police Performance Rebuked by Judge
  • అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజు అరెస్ట్
  • మంగళగిరి కోర్టులో హాజరు, న్యాయమూర్తి సురేష్ బాబు ప్రశ్నల వర్షం
  • పోలీసులు బాగా పనిచేశారన్న కృష్ణంరాజు.. మీ సర్టిఫికెట్ అడగలేదన్న న్యాయమూర్తి
  • వేశ్యల రాజధాని అని ఎందుకన్నారని నిలదీత.. 
  • పొరపాటు చేసినట్లు అర్థమవుతోందన్న పాత్రికేయుడు
  • కృష్ణంరాజుకు జూన్ 26 వరకు జ్యుడీషియల్ రిమాండ్, గుంటూరు జైలుకు తరలింపు
"పోలీసులు తమ విధులను ఎక్సలెంట్‌గా నిర్వర్తించారు" అంటూ కితాబివ్వబోయిన పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టులో ఊహించని సమాధానం ఎదురైంది. "పోలీసుల పనితీరుపై సర్టిఫికెట్ ఇవ్వాలని మిమ్మల్ని అడగలేదు. నేను అడిగిన దానికి సమాధానం చెబితే చాలు" అంటూ న్యాయాధికారి సురేష్‌బాబు స్పష్టం చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన కృష్ణంరాజును నిన్న కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సాక్షి టీవీ ఛానల్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను (మొదటి నిందితుడు) పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం మంగళగిరిలోని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సురేష్‌బాబు కృష్ణంరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. "38 ఏళ్లుగా పాత్రికేయుడిగా పనిచేస్తున్నానంటున్నారు. 62 ఏళ్ల వయసొచ్చింది. మహిళల పట్ల ఇంతటి హేయమైన వ్యాఖ్యలు చేస్తారా? ఏ ఆధారాలున్నాయని ఆ వ్యాఖ్యలు చేశారు? మీరేమైనా సంఘ సంస్కర్తా?" అంటూ సూటిగా ప్రశ్నించారు. భావప్రకటన స్వేచ్ఛకు కూడా హద్దులుంటాయని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రత్యేక మినహాయింపేమీ ఉండదని గట్టిగా హెచ్చరించారు. "మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మీకు తెలుసా? అవి మీకు తప్పుగా అనిపించలేదా?" అని కూడా అడిగారు.

న్యాయమూర్తి ప్రశ్నలకు కృష్ణంరాజు చాలావరకు మౌనంగానే ఉండిపోయారు. పత్రికల్లో కొన్ని కథనాలు చూసి మాట్లాడానని చెప్పగా, వాటి ఆధారంగా మహిళల్ని అవమానపరిచేలా ఎలా మాట్లాడతారని న్యాయమూర్తి నిలదీశారు. విచారణలో భాగంగా, తాను తప్పు చేశానని అర్థమవుతోందని కృష్ణంరాజు బదులిచ్చినట్లు తెలిసింది.

వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి సురేష్‌బాబు, కృష్ణంరాజుకు ఈ నెల 26వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో రెండో నిందితుడుగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ప్రస్తుతం ఇదే జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా, కృష్ణంరాజు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు నిన్న కొట్టివేసింది. పోలీసులు నిందితులను కస్టడీకి కోరుతూ ఈరోజు పిటిషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు, కృష్ణంరాజును కోర్టులో హాజరుపరిచిన సమయంలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు కోర్టు వెలుపల నిరసన వ్యక్తం చేశారు.
VVR Krishnam Raju
Krishnam Raju
Amaravati
Andhra Pradesh
Kommineni Srinivas Rao
Sakshi TV
Defamation
Judicial Remand
Guntur Jail
Mandalagiri Court

More Telugu News