Ravi Shankar: తాళం వేసిన ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు.. తండ్రి కోసం గాలింపు

Mylavaram Tragedy Father Suspected in Childrens Death
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తీవ్ర విషాదం
  • నాలుగు రోజులుగా ఇంటికి తాళం
  • రెండు నెలల క్రితమే వదిలి వెళ్లిపోయిన తల్లి
  • పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల అనుమానం
  • ‘నన్నెవరూ పట్టించుకోలేదు, అందుకే ఈ నిర్ణయం’ అంటూ తండ్రి లేఖ
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజులుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోని మంచంపై ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మైలవరానికి చెందిన వేములమడ రవిశంకర్, చంద్రిక దంపతులకు లక్ష్మీ హిరణ్య (9), లీలాసాయి (7) అనే ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు రెండు నెలల క్రితం చంద్రిక తన భర్త, పిల్లలను వదిలి ఎటో వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలు తండ్రి రవిశంకర్ వద్దే ఉంటున్నారు. గురువారం ఉదయం రవిశంకర్ తండ్రి లక్ష్మీపతి ఇంటికి వచ్చి చూడగా, లోపలి నుంచి తాళం వేసి ఉంది. గది నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా, మనవడు, మనవరాలు మంచంపై ఎలాంటి కదలిక లేకుండా పడి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు.

వెంటనే స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా, లక్ష్మీ హిరణ్య, లీలాసాయి అప్పటికే మరణించి ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చిన్నారుల మృతదేహాలను పరిశీలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పిల్లలను చంపి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడా?
చిన్నారులను వారి తండ్రి రవిశంకరే హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రవిశంకర్ తన సన్నిహితులకు రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ కూడా పోలీసులకు లభించినట్టు సమాచారం. "నా చావుకు ఎవరూ కారణం కాదు. జీవితంలో నేను ఏమీ సాధించలేకపోయాను. నాకు ఎవరూ ధైర్యం చెప్పలేదు. అందుకే నా పిల్లలను చంపుకుని, నేనూ చనిపోతున్నాను" అని ఆ లేఖలో రాసి ఉన్నట్టు తెలిసింది.

ఈ లేఖ రాసిన తర్వాత రవిశంకర్ తన సెల్‌ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతని ఫోన్ సిగ్నల్ చివరిసారిగా కృష్ణా నది సమీపంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, రవిశంకర్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే కోణంలో పోలీసు బృందాలు కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ హృదయ విదారక ఘటనతో మైలవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి వదిలేయడం, తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టాడన్న వార్త స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసులు కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Ravi Shankar
Mylavaram
Children death
Suicide
Krishna River
Andhra Pradesh
Crime news
Family tragedy
Police investigation
Murder suicide

More Telugu News