VVR Krishnam Raju: హైకోర్టు జడ్జిలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఉంటారని తెలిసి కూడా నీచ వ్యాఖ్యలు చేశారు: కృష్ణంరాజు రిమాండ్ రిపోర్ట్

VVR Krishnam Raju Remand Report
  • అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యల కేసు
  • కృష్ణంరాజులో పశ్చాత్తాపం లేదన్న పోలీసులు
  • అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే ఉద్దేశమని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు
సాక్షి టీవీ ఛానల్‌లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో "అమరావతి వేశ్యల రాజధాని" అంటూ అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజు తన చర్య పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి ప్రాంత మహిళలను తీవ్రంగా అవమానించేలా మాట్లాడిన ఆయన, ఆ వ్యాఖ్యలపై కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని, పైగా 'తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదంటూ' వాటిని సమర్థించుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు విడుదల చేశారని పోలీసులు కోర్టుకు నివేదించారు.

ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణంరాజును మంగళగిరిలోని అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కమ్ సివిల్ జడ్జి కోర్టులో తుళ్లూరు పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా, ఈ హేయమైన వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రలో కృష్ణంరాజు ప్రమేయం, పాత్ర, ఆయన వెనుక ఉన్న శక్తుల గురించి ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అంశాలను వివరిస్తూ న్యాయస్థానానికి ఒక రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

అమరావతిలో వివిధ వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్న విషయం తెలిసి కూడా కృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. తద్వారా అన్ని వర్గాల మహిళలతో పాటు, ప్రత్యేకంగా దళిత, గిరిజన మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనేదే ఆయన ఉద్దేశమని తమ నివేదికలో పేర్కొన్నారు.

సీనియర్ పాత్రికేయుడైన కృష్ణంరాజుకు అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా, సబార్డినేట్ జ్యుడీషియల్ సభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా అత్యున్నత స్థానాల్లో పనిచేసే బ్యూరోక్రాట్లు నివసిస్తున్నారనే విషయం తెలుసని, అయినప్పటికీ దురుద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పోలీసులు న్యాయస్థానానికి స్పష్టం చేశారు. 
VVR Krishnam Raju
Krishnam Raju
Amaravati
Andhra Pradesh
Sakshi TV
Defamation
IAS officers
IPS officers
High Court Judges
Remand Report

More Telugu News