VVR Krishnam Raju: చంద్రబాబు, టీడీపీ అంటే నాకు తీవ్ర వ్యతిరేకత ఉంది: పాత్రికేయుడు కృష్ణంరాజు

Krishnam Raju Admits Bias Involvement with Sakshi TV
  • అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు
  • నల్లపాడు పీఎస్ లో కృష్ణంరాజును సుదీర్ఘంగా విచారించిన పోలీసులు
  • సాక్షి ఛానల్ లో తనకు సరైన గుర్తింపు లభిస్తోందన్న కృష్ణంరాజు
అమరావతిపై, ముఖ్యంగా అక్కడి మహిళలపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలను పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సాక్షి టెలివిజన్ ఛానల్‌లో తనకు లభిస్తున్న గుర్తింపు, ప్రాధాన్యత కోసమే తాను ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ పట్ల తనకు తీవ్ర వ్యతిరేక భావన ఉందని, ఈ కారణంగానే సాక్షి ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాలకు కొమ్మినేని శ్రీనివాసరావు తనను ఆహ్వానిస్తుంటారని కృష్ణంరాజు చెప్పినట్లు తెలిసింది.

బుధవారం అరెస్టయిన కృష్ణంరాజును నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచి రాత్రంతా సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ సందర్భంగా, "సాక్షి టీవీలోనే నాకు సరైన గుర్తింపు దక్కుతోంది. అందుకే ఆ ఛానల్ చర్చల్లోనే ఎక్కువగా పాల్గొంటున్నాను. ఈ క్రమంలోనే అమరావతి మహిళలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది" అని కృష్ణంరాజు పేర్కొన్నట్లు సమాచారం. కొమ్మినేని శ్రీనివాసరావుతో తనకు సాన్నిహిత్యం ఉందని, చర్చా కార్యక్రమాల్లో ఆయన తనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే కూటమి ప్రభుత్వంపైనా, అమరావతిపైనా విమర్శలు చేస్తున్నానని ఆయన వివరించినట్లు తెలిసింది.

ముందస్తు నేరపూరిత కుట్రలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని పోలీసులు ప్రశ్నించగా, కృష్ణంరాజు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. "గత కొంతకాలంగా సాక్షి టీవీ చర్చల్లో నేను చేస్తున్న వ్యాఖ్యలపై నా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం తెలిపారు. నేను మొండివాడిని కావడంతో వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. నా అభిప్రాయాలను మరింత ఘాటుగా చెప్పాలనే ఉద్దేశంతో, అరకొర అధ్యయనంతోనే అమరావతి మహిళలపై వివాదాస్పదంగా మాట్లాడాను" అని కృష్ణంరాజు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వీడియో విడుదల చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా, "పత్రికల్లో వచ్చిన కొన్ని అంశాల ఆధారంగానే నేను మాట్లాడాను" అని కృష్ణంరాజు బదులిచ్చినట్లు తెలిసింది. అయితే, "ఒక గ్రామంలో జూదం ఆడుతున్న కొందరిని అరెస్టు చేసినట్లు పత్రికల్లో వార్త వస్తే, ఆ ప్రాంతం మొత్తాన్ని జూదానికి నిలయంగా నిర్ధారిస్తారా?" అని పోలీసులు ఎదురు ప్రశ్నించగా, కృష్ణంరాజు సమాధానం చెప్పలేక తడబడినట్లు సమాచారం.
VVR Krishnam Raju
Krishnam Raju
Sakshi TV
Amaravati
Chandrababu Naidu
TDP
Kommineni Srinivasa Rao
Andhra Pradesh Politics
Controversial Remarks
Police Investigation

More Telugu News