Shreyas Iyer: పది రోజుల వ్యవధిలో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు మ‌రోసారి హార్ట్ బ్రేకింగ్‌!

Shreyas Iyer Suffers Another Heartbreak in Mumbai T20 League Final
  • శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్‌లో వెంటాడుతున్న దురదృష్టం
  • పది రోజుల వ్యవధిలో రెండు టీ20 టోర్నీ ఫైనల్స్‌లో ఓటమి
  • ముంబ‌యి టీ20 లీగ్ ఫైనల్లో అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ఫాల్కన్స్ ఓటమి
  • అంతకుముందు ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పరాజయం
  • రెండు ఫైనల్స్‌లోనూ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైన శ్రేయస్ అయ్యర్
  • ఓటమికి ఎవరినీ నిందించనన్న అయ్యర్
  • ది వెన్నుపోటుతో సమానమంటూ వ్యాఖ్య

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ఫైనల్స్ కలిసి రావడం లేదు. కేవలం పది రోజుల వ్యవధిలోనే రెండు కీలక టీ20 టోర్నీల ఫైనల్స్‌లో అతడి సారథ్యంలోని జట్లు ఓటమిపాలయ్యాయి. ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి తేరుకోకముందే ముంబ‌యి టీ20 లీగ్ ఫైనల్లోనూ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ టైటిల్ పోరులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని సోబో ముంబ‌యి ఫాల్కన్స్ జట్టు, ముంబ‌యి సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ చేతిలో ఓటమి చవిచూసింది.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సోబో ముంబ‌యి ఫాల్కన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయూరేశ్‌ తాండేల్ (50 నాటౌట్), హర్ష్ అఘవ్ (45 నాటౌట్) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. కీలకమైన ఫైనల్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి విఫలమయ్యాడు. 17 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) తరఫున ఆడే యువ ఆటగాడు అంక్రిశ్‌ రఘువంశీ కూడా (12 బంతుల్లో 7 ర‌న్స్‌) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అనంతరం 158 పరుగుల లక్ష్య ఛేదనలో మరాఠా రాయల్స్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడింది. చిన్మయ్ రాజేశ్‌ సుతార్ (53), అవేస్ ఖాన్ నౌషాద్ (38) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. సిద్ధేశ్‌ లాడ్ సారథ్యంలోని మరాఠా రాయల్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ముంబ‌యి టీ20 లీగ్ 2025 ఛాంపియన్‌గా నిలిచింది.

మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి ఏ ఒక్కరినీ నిందించదలచుకోలేదని, అది వెన్నుపోటు పొడిచినట్లు అవుతుందని వ్యాఖ్యానించాడు. "ఏ ఒక్క సంఘటనను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు. టోర్నీ ఆసాంతం మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. ఫైనల్‌కు ముందు మేం కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాం. ఇది కేవలం ఒక ఆఫ్ గేమ్. ఇలాంటి సమయంలో ఎవరినీ నిందించలేం. అది వెన్నుపోటుతో సమానం. నేను అలాంటివి ఇష్టపడను. మేం చాలా నేర్చుకున్నాం" అని అయ్యర్ పేర్కొన్నాడు. 

"ఫైనల్లో ఓడిపోతే నిరాశ చెందడం సహజం. అది వారిని బాధించి ఉంటుంది. కానీ వచ్చే ఏడాది వారు తిరిగి వచ్చినప్పుడు వారికి అదనపు ప్రేరణ, ఆత్మవిశ్వాసం ఉంటాయి. వారి ప్రదర్శన పట్ల వారు గర్వపడాలి" అని అయ్యర్ అన్నాడు.

కాగా, ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా వాంఖడే స్టేడియానికి హాజరయ్యాడు. అయ్యర్ జట్టు ఓటమి అనంతరం రోహిత్ శర్మ చేతుల మీదుగా శ్రేయస్ అయ్యర్ రన్నరప్ మెడల్ అందుకోవడం గమనార్హం. ఈ ముంబ‌యి టీ20 లీగ్‌లో శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగతంగానూ పెద్దగా రాణించలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏ ఒక్కదాంట్లోనూ 25 పరుగుల మార్కును దాటలేకపోయాడు. ఇలా పది రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఫైనల్స్‌లో ఓటమి పాలుకావడంతో శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.
Shreyas Iyer
Mumbai T20 League
T20 Finals
Rohit Sharma
Sobo Mumbai Falcons
Maratha Royals
Cricket
IPL 2025
Wankhede Stadium
Cricket Finals

More Telugu News